తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
షాద్నగర్, మే 24 (విజయక్రాంతి): అకాల వర్షం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి రైతుల సమస్యలను పరిశీలించారు.
మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులు భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన విష్ణువర్ధన్ రెడ్డి రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే పంట నష్టానికి తగిన పరిహారం అందించి, రైతులను ఇబ్బందులకు గురి కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ సెక్రటరీ తో విష్ణువర్ధన్ రెడ్డి ఫోన్ లో మాట్లాడి రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆయన అన్నారు.
రైతులకు నష్టం జరిగితే రైతుల పక్షాన బిజెపి పార్టీ అండగా ఉంటూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. దాన్యం తడవకుండా షెడ్ లు ఎందుకు ఏర్పాటు చేయలేదు అని సెక్రటరీని ఫోన్ లో నిలదీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి ఇస్నాతి శ్రీనివాస్, కౌన్సిలర్ ప్యాట అశోక్,వంశీకృష్ణ,చేగు సుధాకర్ అప్ప, సర్పంచ్ బోయ అశోక్, సర్పంచ్ మూడవత్ రాజు నాయక్,అత్తాపురం మహేందర్ రెడ్డి, క్యామ మహేష్,అనిల్ కుమార్ గౌడ్, కిట్టు యాదవ్,శ్రావణ్,అందెల సందీప్, ప్రశాంత్,నడికూడ రవి యాదవ్, గుండ్ల అశోక్, కృష్ణ , నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.






