31 July, 2026 | 12:49 AM

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా కిట్ల పంపిణీ

31-07-2026 12:29 AM

12 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం

పటాన్ చెరు, జూలై 30 : సమాజ సేవ, సుస్థిర అభివృద్ధి పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం రుద్రారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్లాస్ మేట్ నోట్ బుక్ లు, క్రేయాన్లు, పెన్నులు, పెన్సిళ్లు, స్టేషనరీ కిట్లతో పాటు భోజనం ప్లేట్లను పంపిణీ చేసింది. చుట్టుపక్కల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యా అవసరాలకు మద్దతుగా, గత 12 సంవత్సరాలుగా గీతం నిరంతరం నిర్వహిస్తున్న సుదీర్ఘకాల అవుట్-రీచ్ కార్యక్రమంలో భాగంగా చెప్పారు.

ఈ పంపిణీ కార్యక్రమం, ‘వ్యర్థాల నుంచి సంపద’ అనే నినాదంతో గీతం చేపడుతున్న సుస్థిరతా ప్రయత్నం. ఈ కార్యక్రమం ద్వారా గీతం విద్యార్థులు ఆతిథ్య విభాగం సహకారంతో ప్రాంగణం నుంచి చదివేసిన వార్తాపత్రికలు, పాత రికార్డులు, పుస్తకాలు, ఇతర పునర్వినియోగ కాగితపు సామగ్రిని సేకరిస్తారు. ఈ సామగ్రిని రీసైక్లింగ్ కోసం ఐటీసీ పేపర్ బోరడ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ విభాగానికి అప్పగిస్తారు. ప్రతిఫలంగా, ఐటీసీ క్లాస్ మేట్ విద్యా ఉత్పత్తులను అందిస్తుంది. వీటిని పేద విద్యార్థులకు పంపిణీ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత రెండింటినీ గీతం ప్రోత్సహిస్తోంది.