calender_icon.png 19 January, 2026 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ సజావుగా నిర్వహించాలి

19-01-2026 09:49:22 PM

జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్

గద్వాల: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు మంగళవారం నిర్వహించే వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధిత ఉన్నతాధికారులు హైదరాబాదు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వం ఇదివరకే గ్రామీణ ప్రాంతాల మహిళ సంఘాల సభ్యులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిర మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 70 మునిసిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సోమవారం కొన్ని మున్సిపాలిటీలలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని, మిగిలిన మునిసిపాలిటీల్లో మంగళవారం పంపిణీ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా లేని సాధారణ మహిళలకు సైతం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే చీరలు పంపిణీ చేయాలన్నారు.

వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. గద్వాల ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నుంచి సంబంధిత శాఖల అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న కలెక్టర్ బి. ఎం. సంతోష్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి చీరలు, వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణి కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, ఇతర అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, గద్వాల మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్ పాల్గొన్నారు.