19-01-2026 09:53:33 PM
గులాబీ కండువా వేసి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పైలట్..
కాస్కో ఎమ్మెల్యే తాండూర్ మున్సిపల్ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం.. పైలట్
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డలి రవీందర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గడ్డలి పరిమళ దంపతులు దాదాపు 500 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని.. కేవలం డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా తమ సొంత పనులు చేసుకుంటున్నారని ....పట్టణ అభివృద్ధి కోసం 18 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి అప్పు తీసుకొని ప్రజల నెత్తిన అప్పుల భారం మోపుతున్నారని ఆరోపించారు.
బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని అన్నారు. ఇకా కాస్కో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి మరింత మంది నాయకులు రెండు మూడు రోజుల్లో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని .. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగి వేసారి పోయారని మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పడంతో తాండూరులో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పరిమళ మాట్లాడుతూ... అధికార కాంగ్రెస్ పార్టీలో గత రెండు సంవత్సరాలుగా ఉండి వార్డ్ అభివృద్ధికి, ప్రజలకు ఏమి చేయలేకపోయానని.. అభివృద్ధి చేసేందుకు పలుమార్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని తెలిపినా కూడా పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కొట్రిక విజయలక్ష్మి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు , టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.