19-01-2026 09:45:50 PM
- జెండా ఊపి బస్సును ప్రారంభించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఆయిల్ ఫాం సాగు, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సందర్శనకు జిల్లాలోని పలు మండలాల నుంచి రైతులు సోమవారం తరలి వెళ్లే బస్ యాత్రను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ప్రారంభించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశాలు జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలో నిర్వహించారు. అలాగే జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులకు ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం లక్ష్యాలు వ్యక్తిగతంగా కేటాయించారు.
ఒక్కో పీఏసీఎస్ పరిధిలో దాని సీఈవో 100 ఎకరాలు సాగులోకి తీసుకురావాలని, మండల వ్యవసాయ అధికారికి 20 ఎకరాలు, సహాయ వ్యవసాయ అధికారికి 50 ఎకరాలు, ఉద్యానవన శాఖ అధికారులకు 200 ఎకరాల చొప్పున సాగు విస్తీర్ణం లక్ష్యమని నిర్ణయించారు. అలాగే బోయినపల్లి మండల కేంద్రంలో ఆయిల్ పామ్ సాగుతో లాభాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఏ ఏ పంట వేస్తే ఎంత దిగుబడి, లాభాలు పూర్తిగా వివరించారు. ఈ సందర్భంగా రైతులకు ఆయిల్ పామ్ సాగు, ఫ్యాక్టరీ సందర్శనకు తరలిస్తామని ఇంచార్జి కలెక్టర్ పేర్కొన్నారు.
ఇందులో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయం సముదాయం నుంచి సోమవారం సాయంత్రం జిల్లాలోని బోయినపల్లి, ఇల్లంతకుంట ఇతర మండలాల నుంచి దాదాపు 50 మంది రైతులను కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటకు తరలి వెళ్తుండగా, ఇంచార్జి కలెక్టర్ ప్రారంభించారు. రైతులు సాగు విధానం, లాభాలు ఇతర అన్ని అంశాలు తెలుసుకోవాలని వాటిని తాము సాగు చేయనున్న చోట అవలంబించాలి సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఉద్యానవన శాఖ అధికారులు గోవర్ధన్, లోకేష్ తదితరులు ఉన్నారు.