17 July, 2026 | 1:16 AM

పదో తరగతి విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

17-07-2026 01:16 AM

నారాయణఖేడ్, జూలై 16: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యాభ్యాసంలో ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో హార్ట్ టూ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని ఎల్గొయి, షెల్గిరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులకు నోటుపుస్తకాలు పంపిణీ చేశారు. విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె. వెంకటరమణ సహకారంతో ఒక్కో విద్యార్థికి ఏడు నోటుపుస్తకాలు అందజేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మూడే రవి నాయక్ తెలిపారు.

ఈ సందర్భంగా మూడే రవి నాయక్ మాట్లాడుతూ దాత కె. వెంకటరమణ సహకారంతో గత మూడు సంవత్సరాలుగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నోటుపుస్తకాలు, వార్షిక పరీక్ష ఫీజులు, ఎగ్జామ్ కిట్లు అందిస్తూ విద్యకు చేయూతనందిస్తున్నారని తెలిపారు. ఇందుకు దాతకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమావత్ దేవిసింగ్, ఉపాధ్యాయులు సామ్య నాయక్, సంగ్రామ్, భరత్, రాఘవేంద్ర, కాశీరాం తదితరులు పాల్గొన్నారు.