గద్దెలు తొలగింపు
గోవర్ధనగిరిలో మళ్లీ రగిలిన విగ్రహ వివాదం
రహదారి భద్రత కోసమే నిర్ణయమన్న సర్పంచ్
ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటున్న దళిత సంఘాలు
హుస్నాబాద్/అక్కన్నపేట, జూలై 16: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం గతంలో నిర్మించిన ఎత్తున గద్దెలను తొలగించడం మరోసారి వివాదానికి దారితీసింది. ఒకవైపు రహదారి భద్రత దృష్ట్యా గద్దెలను తొలగించామని గ్రామపంచాయతీ చెబుతుండగా, మరోవైపు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామ సర్పంచ్ పెండెల రమాదేవి మాట్లాడుతూ, గత పాలకవర్గం తీర్మానం మేరకు చౌరస్తాలో అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాల కోసం ఎత్తున గద్దెలు నిర్మించారని తెలిపారు. అయితే విగ్రహాల ప్రతిష్ఠాపన జరగకుండానే గద్దెలు ఉండిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి, తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.ఈ నేపథ్యంలో ప్రస్తుత గ్రామపంచాయతీ తీర్మానం చేసి జిల్లా అధికారుల అనుమతితో గద్దెలను తొలగించామని, చౌరస్తాకు సమీపంలోని అనువైన ప్రదేశంలో కొత్తగా గద్దెలు నిర్మించి అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని వెల్లడించారు. ఎస్సీ సామాజిక వర్గ ప్రతినిధులతో చర్చించి వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
అయితే ఈ నిర్ణయాన్ని గ్రామంలోని దళిత సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. గత పాలకవర్గం అధికారిక తీర్మానం ఆధారంగా అదే చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు చందాలు సేకరించి విగ్రహాన్ని సిద్ధం చేశారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల సమయంలో ప్రస్తుత సర్పంచ్ అదే చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చడం విశ్వాసానికి భంగం కలిగిస్తోందని వారు ఆరోపించారు.కొత్త ప్రదేశంలో గద్దెల నిర్మాణం పూర్తి చేసి, అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాతే పాత గద్దెలను తొలగించి ఉంటే వివాదం తలెత్తేది కాదని దళిత సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం ఈ అంశం గ్రామంలో చర్చనీయాంశంగా మారగా, అధికారులు, గ్రామపంచాయతీ, దళిత సంఘాల ప్రతినిధులు పరస్పర చర్చల ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని గ్రామస్తులు కోరుతున్నారు.






