11 August, 2026 | 3:09 PM

Breaking News

ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి

11-08-2026 02:04 PM

– జిల్లా కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు వరి నాట్లు వేస్తున్నట్లు గమనించామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బోరుబావులు ఉన్న రైతులు సైతం వరి సాగుకు అవసరమైన నీరు అందుబాటులో ఉంటుందా అనే విషయాన్ని ఆలోచించుకోవాలని అన్నారు.జిల్లాలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే వర్షపాతం మెరుగ్గా ఉన్నప్పటికీ, వరి సాగుకు సరిపడా నీటి లభ్యత ఉండకపోవచ్చని  పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఆరుతడి పంటలు సాగు చేసి రైతులు లాభాలు పొందాలని కోరారు. 

15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు అందజేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండల, గ్రామస్థాయిలో ప్రణాళికాబద్ధంగా కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వివరించారు.జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై నిఘా ఏర్పాటు చేశామని, ఎక్కడైనా అక్రమంగా తరలిస్తే ప్రజలు అధికారులకు సమాచారం అందించాలని కోరారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.