భూభారతిలో 39,513 దరఖాస్తులు
పరిష్కారానికి చర్యలు..
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో జిల్లా వ్యాప్తంగా రైతుల నుండి భూ సమస్యలకు సంబంధించి 39,513 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి సంబంధీకులకు నోటీసులు జారీ చేసి పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని తహసీల్దార్లను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) సూచించారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భూభారతి రెవిన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ కె వీరబ్రహ్మచారి, ఆర్డిఓ కృష్ణవేణి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన భూభారతి రెవెన్యూ చట్టం ద్వారా రైతులకు భూ సమస్యల పరిష్కారం చూపాలన్నారు. రైతు భరోసా ద్వారా 2,11,973 రైతులకు 268. 33 కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. 2025 వానాకాలం సీజన్ కు సంబంధించి ఎకరానికి 6000 చొప్పున రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని చెప్పారు.






