18-09-2025 08:08:25 PM
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలి
పనులు సకాలంలో పూర్తిచేసి బిల్లులు పొందాలి
విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందించాలి, పోషక ఆహారం అందించాలి
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్..
కోరుట్ల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్(District Collector Satya Prasad) గురువారం మండలంలోని యామాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్ వంటగది నిర్మాణం పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో మంజూరైన ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు గ్రౌండింగ్ చేసి పనులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుపేదలకు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందజేసే విధంగా చూడాలన్నారు. ఇండ్ల నిర్మాణాలకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని లబ్ధిదారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పనులు సకాలంలో పూర్తిచేసి బిల్లులు త్వరగా పొందాలని లబ్ధిదారులకు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితంగా అందిస్తుందని, రవాణా ఖర్చులు కూలీల ఖర్చులు లబ్ధిదారులే భరించాలన్నారు.
యమాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలోని వంటగదిని పరిశీలించారు చిన్నారులకు అందిస్తున్న ఆహార పదార్థాలపై నాణ్యత పై ఆరాతీశారు.అంగన్వాడి కేంద్రంలోని ప్రతి విభాగాన్ని కోడిగుడ్లను సమూలంగా పరిశీలించారు.సిబ్బందితో మాట్లాడి చిన్నారులకు గర్భిణీలకు బాలింతలకు అందిస్తున్న పోషకాహారం సదుపాయాలను తెలుసుకున్నారు.అంగన్వాడి కేంద్రాల్లోని చిన్నారులకు,గర్భిణీలకు,బాలింతలకు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ తెలిపారు.అక్టోబర్ 16 వరకు పోషణ మాసం కార్యక్రమం అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించాలని తెలిపారు.ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా పోషణ మాసం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. పోషణ మాసంలో గర్భిణీలు, బాలింతలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆరోగ్యాకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పౌష్టికాహారంపై అవగాహనా కల్పించాలని తెలియజేశారు.