ఏప్రిల్ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఇందిరమ్మ ఇళ్లపై మిషన్ మోడ్‌లో పని చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం,(విజయక్రాంతి): జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, పూర్తయిన ఇండ్లను గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుందని, జిల్లాలో మొత్తం 16 వేల 495 గృహాలు మంజూరయ్యాయని తెలిపారు.
99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఫీల్డ్ విజిట్స్‌లో అనేక మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లపై సరైన దృష్టి లేదని, పనుల పురోగతి తక్కువగా ఉందని గమనించామని తెలిపారు. ప్రజావాణిలో గృహాలపై ఎక్కువ సంఖ్యలో వినతులు రావడం మండలాల్లో పనితీరును సూచిస్తోందని అన్నారు. ఇసుక సమస్య కూడా ప్రస్తుతం పరిష్కారమైందని, ఇక పనుల పురోగతి గణనీయంగా పెరగాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 9 వేల 217 ఇళ్లు స్లాబ్ దశలో ఉండగా, సుమారు 2 వేల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు.
ఏప్రిల్ నెలాఖరులోగా కనీసం 8 వేలు స్లాబ్ దశలో ఉన్న ఇళ్లను పూర్తిచేసి, మొత్తం 10 వేల ఇళ్ల గృహ ప్రవేశాలు నిర్వహించడం తక్షణ లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. అన్ని మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు స్లాబ్ దశలో ఉన్న ఇళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరులోగా 10 వేల ఇళ్ల గృహ ప్రవేశాల లక్ష్యాన్ని సాధించేందుకు వారాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఏప్రిల్ 10, 17, 24, 30 తేదీలను సమీక్ష రోజులుగా నిర్ణయించి వారం, వారం జరిగిన పురోగతిని సమీక్షిస్తామని, బిల్లుల చెల్లింపుల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
సమన్వయంతో మిషన్ మోడ్‌లో పని చేయాలని సూచించారు. గుడిసెల రహిత తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, జిల్లాలో గుడిసెలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మండలాల వారీగా గుడిసెల గుర్తింపు సర్వేను థర్డ్ పార్టీ ద్వారా ఆడిట్ చేస్తామని, తప్పులు ఉంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు గుడిసెలపై సరైన సమాచారం వెంటనే సేకరించాలని ఆదేశించారు. గుడిసెలలో నివసిస్తున్న వారిని, టార్పాలిన్ కవర్ల క్రింద నివసించే వారిని, హోమ్ లెస్ వారిని గుర్తించాలని సూచించారు.
ఈ సర్వే ఖచ్చితంగా నిర్వహించి 2 రోజుల్లోపు తుది నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గుడిసెల గుర్తింపు అనంతరం, మొదటి దశలో ఇళ్లు నిర్మించని లబ్ధిదారుల వద్ద మిగిలిన ఇళ్లను గుడిసెలలో నివసించే వారికి కేటాయించా లని సూచించారు. జిల్లాలో సుమారు 1,943 గృహాలు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదని పేర్కొన్న జిల్లా కలెక్టర్, అందులో 252 గృహాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద లబ్ధిదారులు ప్రారంభించ లేకపోయారని, మొదటి దశలో గృహాలు మంజూరై కూడా ఆర్థిక సమస్యల వల్ల పనులు ప్రారంభించలేకపోయిన 252 గుడిసెల లబ్ధిదారుల ఇళ్లను ఒక వారం లోపు వెంటనే ప్రారంభించాలన్నారు. ఇందు కోసం రుణాలను మంజూరు చేసి, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు.




