2 May, 2026 | 1:23 AM

నియోజకవర్గస్థాయి 99 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలి

02-05-2026 12:04 AM

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం అవసరం

నకిలీ విత్తనాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు

డివిజన్ స్థాయిలోనూ ప్రజావాణి నిర్వహణ

గూగుల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల టౌన్, మే 01: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమానికి సంబంధించి మే రెండవ తేదీన నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం గూగుల్ సమావేశంలో జిల్లాలోని అధికార యంత్రాంగంతో కలెక్టర్ మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, పౌరులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలన్నారు.

గృహ జ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను ఈ సమావేశంలో తెలియజేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలలో అల్పాహారం, ఇంటర్ కళాశాలలలో మధ్యాహ్న భోజనం, ఇందిరమ్మ జీవిత బీమా, తదితర కొత్త పథకాల గురించి కూడా తెలియజేయాలన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల స్థాయి సమావేశాలు, వివిధ శాఖల వారోత్సవాల కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలతో ఛాయాచిత్ర ప్రదర్శన, ముఖ్యమైన శాఖల స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గస్థాయి కార్యక్రమాల్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. 

నకిలీ విత్తనాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు

జిల్లాలో నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు తమ పరిధిలోని ఫర్టిలైజర్ దుకాణాలను తరచు తనిఖీలు చేయాలని, నానో యూరియాపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకనుంచి ప్రతి సోమవారం డివిజన్ స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి అన్ని శాఖల నుంచి జిల్లా స్థాయి తర్వాతి డివిజన్ స్థాయి కేడర్ కలిగిన అధికారులు తప్పకుండా పాల్గొనాలని ఆదేశించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను అనుసరించి జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా చూడాలని, పశువులకు కూడా నీటి తొట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 4వ తేదీ నుంచి నిర్వహించే రైతు వారము కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని, అన్ని రైతు వేదికలలో రైతులకు పంటల మార్పిడి, నానో యూరియా వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమాలను వ్యవసాయ, హార్టికల్చర్, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖల అధికారులు పాల్గొనాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, డిఎస్పి మొగిలయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.