29 April, 2026 | 4:57 AM

పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేకుండా చూడాలి

29-04-2026 02:22 AM

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ 

మహబూబాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ కు కొరత లేకుండా అధికారులు డిమాండ్కు తగ్గట్టుగా స్టాక్ తెప్పించి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు.

ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ తో కలిసి పెట్రోల్, డీజిల్ గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజిల్ ,పెట్రోల్ ,గ్యాస్ ఆయిల్ (ఇంధనాలను) అందించాలని, ప్రస్తుత డిమాండ్ కనుగుణంగా లభ్యతను స్వీకరించి సరఫరా చేయుటలో వేగం పెంచాలని సూచించారు.

కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే చర్యలు తీసుకుంటామని, అధిక ప్రాధాన్యత వ్యవసాయ ఆధారిక వాహనాలు హార్వెస్టింగ్, ట్రాక్టర్ తదితర వాటికి ప్రాముఖ్యత కల్పించి ఇంధనాలు అందించాలని, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, పెట్రోలియం కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో నిత్యం మాట్లాడుతూ సమస్యలు రాకుండా ఉత్పత్తులను అందించాలని ఆదేశించారు.

పెట్రోల్ బంకులలో డబ్బాలలో డీజిల్, పెట్రోల్ తీసుకు వెళ్ల రాదని, అవసరం లేకున్నా అధికంగా వినియోగించరాదని సూచించారు. ప్రభుత్వం అత్యంత వేగంగా డీజిల్ పెట్రోల్ సరఫరాకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ఈ సమావేశంలో పౌర సరఫరా శాఖ అధికారి రమేష్, ఆయిల్ కంపెనీ ప్రతినిధులు, పెట్రోల్, డీజిల్, డీలర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.