02-12-2025 05:25:07 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని వాణిశ్రీ సందర్శించారు. అనంతరం గర్రెపల్లి, కొలనూర్, ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు ఒక పి.ఎచ్.సి. తరువాత ఒక పి.ఎచ్. సి.కి సమీక్ష సమావేశం, వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు పురోగతిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాణిశ్రీ మాట్లాడుతూ ఈ నెల థీమ్ అప్పుడే పుట్టిన బిడ్డ సంరక్షణ అవసరాన్ని తెలియజేయడం” పై ఆశలకు వివరణాత్మక అవగాహన కల్పించారు. పుట్టిన వెంటనే లేదా కనీసం ఒక గంటలోపు ముర్రు పాలు పట్టించడం, కంగారు విధానంలో శిశువును వెచ్చగా ఉంచడం, అవసరమైన వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, అలాగే ప్రమాద సూచనలు, లక్షణాలపై తల్లులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు.
అదేవిధంగా గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ఎర్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచిస్తూ, తొలి రెండు ఆరోగ్య పరీక్షలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రములలో మూడవ, నాల్గవ పరీక్షలను సుల్తానాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రములో నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షల కోసం గర్భిణీల తరలింపునకు 102 ప్రభుత్వ వాహన సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల వారీగా జ్వరాల సర్వే నిర్వహించాలని, ప్రతి శుక్రవారం “డ్రై డే” పాటించాలని సూచించారు. తగ్గని దగ్గు, జ్వరం లేదా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారిని వెంటనే స్పూటం పరీక్షలకు పంపించి, క్షయవ్యాధి నిర్ధారణ చేయాలని పేర్కొన్నారు.
అలాగే చిన్నపిల్లలకు డ్యూ లిస్టు ప్రకారం 100% వ్యాధినిరోధక టీకాలు వేయాలని, ఎవరూ వ్యాక్సిన్ డ్యూ లేకుండా చూడాలని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలనను కచ్చితంగా పాటించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఆర్. రాజమౌళి, డాక్టర్ బి. శ్రీరాములు, డాక్టర్ కెవి సుధాకర్ రెడ్డి, డాక్టర్ బి. కిరణ్ కుమార్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ ఉదయ్, జిల్లా డేటా మేనేజర్ మహేందర్, డి.పి.ఏం. ఓ. దేవి సింగ్, డి.పి.సి.తీట్ల రాజేశం, సంబధిత ఆరోగ్య కేంద్రం ల వైద్య అధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.