21-08-2025 06:58:20 PM
జిల్లాలో డీజేలు, అధిక శబ్దాలు చేసే సౌండ్ సిస్టంలపై పూర్తి స్థాయిలో నిషేధం.
జాతీయ మెగా లోక్ ఆధాలత్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలి.
నేర సమావేశంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లాలో పోలీస్ స్టేషన్ల యొక్క పనితీరును, కేసుల ఛేదనలో సాధించిన పురోగతిని అంచనా వేసుకుంటూ రానున్న కాలంలో దృఢనిశ్చయతో పనిచేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే(District SP Gite Mahesh) సూచించారు. పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీలు, సీఐలు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తరచు సందర్శిస్తూ నమోదైన వివిధ రకాల కేసులు యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్ఐలకు కేసుల దర్యాప్తుకు సంభందించి సూచనలు ఇవ్వాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన రహదారులపై ధర్నాల పేరుతో ప్రజారవాణాకు, సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, పెట్రోలింగ్ చేసే సమయంలో, అనుమానిత వ్యక్తులను, పాత నేరస్తులను, రౌడి షీటర్స్ ని తనిఖీ చేయాలన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజు వాహనాల తనిఖీ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని,బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వారిపై కఠినంగా వ్యవాహరించాలన్నారు. జిల్లాలో గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.అక్రమ కార్యకలాపాలు అయిన మట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట, గుడుంబా, పిడిఎస్ రైస్, వాటిపై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.సెప్టెంబర్ 13 న జరిగే జాతీయ మెగా లోక్ ఆధాలత్ ని ప్రజలు సద్వినియోగం చేసుకునేల అవగాహన కల్పించాలని, గుర్తించిన పెండింగ్ కేసులల్లో అన్ని పరిష్కరం అయ్యే విధంగా ప్రతి అధికారి కృషి చేయలని సూచించారు.గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలి రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్.ఐ లు,ఇన్ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు.
గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని,ఈవిషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. విగ్రహాల ప్రతిష్టపన నుండి నిమార్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు.మండలాల వారిగా నిమార్జనం జరిగే ప్రదేశాలను గుర్తించి భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. గణేష్ మండపాల వద్ద, శోభాయాత్రలో డి.జే లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు.గణేష్ మండపాల వద్ద,శోభాయాత్రలో నిబంధనలు విరుద్ధంగా డి.జే లు,అధిక శబ్దాలు చేసే సౌండ్ సిస్టంల పై పూర్తి స్థాయిలో నిషేధం ఉందని,నిబంధనలు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే డి.జే యజమానులతో పాటు మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.అవసరం మేరకు చిన్న స్పీకర్లు పోలీస్ వారి అనుమతితో ఏర్పాటు చేసుకోలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు,ఆర్.ఐలు,ఎస్.ఐ కు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.