21-08-2025 08:36:19 PM
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ
హనుమకొండ (విజయక్రాంతి): నడుస్తున్న సమాజానికి సీనియర్ సిటీజన్స్ మార్గదర్శకులని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ చైర్మన్ వి.బి.నిర్మలా గీతాంబ అన్నారు. గురువారం ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి యం.సాయి కుమార్ అధ్యక్షతన న్యాయ సేవా సదన్ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, దైవసమానులుగా భావించినప్పుడే మనిషి విలువకు అర్ధం అన్నారు. చట్టపరమైన వయోవృద్ఫుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. సీనియర్ సిటీజన్స్ సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడపడానికి ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలు ఆచరణరూపం దాల్చడానికి డి.ఎల్.ఎస్.ఏ. కృషిచేస్తుందని అన్నారు.
ప్రతి కుటుంబంలో వయోవృద్ధులు ఉంటారని, వారిని ఏ విధంగా కూడా ఇబ్బందుల పడనీయకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస.సుధీర్ మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం మన ధర్మం, వారికి బ్రతుకు భరోసా కల్పించడం మన ధ్యేయం, వారిని ఆదరించడం మన కర్తవ్యం, వారి పట్ల ప్రేమ చూపడం మనిషి తరం యొక్క నిజమైన నిర్వచనం అని తెలిపారు. సీనియర్ న్యాయవాది తీగల.జీవన్ గౌడ్ మాట్లాడుతూ "వృద్ధుల పాత్ర ఎంతో విలువైనదిగా తెలిపారు. వృద్ధులు అంటే వయసు పెరిగిన వారు కాదు, జీవన అనుభవాల ఖజానా, జ్ఞాన సంపదగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయి కుమార్, న్యాయవాదులు, ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.