15 August, 2026 | 3:03 PM

డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ డీజే సిద్ధార్థ్

17-06-2024 09:52 PM

డైలీ పబ్బులకు వెళ్తున్న వారిపై ప్రత్యేక నిఘా

హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ వినియోగిస్తున్న, విక్రయిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా పబ్బుల్లో మాదకద్రవ్యాలను వినియోగిస్తున్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. డైలీ పబ్బులకు వెళ్లే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, అనుమానితులను అదుపులోకి తీసుకుని డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. కాగా, నగరంలో డీజే సిద్ధార్థ్‌గా పేరుగాంచిన వ్యక్తిని సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

పలు పేరుగాంచిన పబ్బులో డీజేగా వ్యవహారిస్తున్న సిద్ధార్థ్ నుంచి నమూనాలు తీసుకుని పరీక్షించగా, అతను డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా సిద్ధార్థ్‌తో పాటు మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. గత కొంతకాలం నుంచి సిద్ధార్థ్ పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. పబ్‌లపై దాడులు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.