4 June, 2026 | 1:41 AM

కర్ణాటక పీఠంపై డీకే

04-06-2026 01:05 AM
  1. ముఖ్యమంత్రిగా శివకుమార్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ 
  2. డిప్యూటీ సీఎంగా పరమేశ్వరతో సహా మరో 13 మంది మంత్రులు
  3. బెంగళూరు లోక్‌భవన్‌లో వేడుక
  4. క్యాబినెట్‌లోకి సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే కుమారులు యతీంద్ర, ప్రియాంక్
  5. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జునఖర్గే, రాహుల్ గాంధీ, పలువురు సీఎంలు హాజరు
  6. ఫోన్‌లో డీకేఎస్‌కు సోనియాగాంధీ శుభాకాంక్షలు

బెంగళూరు, జూన్ 3: కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంత్రివర్గంలో సీనియర్ నేత జీ పరమేశ్వరతో సహా మరో 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. లోక్ భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో సీఎం డీకేఎస్‌తో సహా మొత్తం 14 మందిని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమా ణ స్వీకారం చేయించారు. కానీ మంత్రులకు శాఖలను కేటాయించలేదు.

అయితే పరమేశ్వర్‌కు డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది. డీకే శివకుమార్ రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని, ‘గంగాధర అజ్జ’ అనే గురువు పేరు మీద, ఉపముఖ్యమంత్రిగా నియమితులు కానున్న పరమేశ్వర, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు మీద ప్రమాణ స్వీకారం చేశారు. డీకేఎస్ క్యాబినెట్‌లో ఇద్దరు మినహా మిగతావారందరూ గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారే ఉన్నారు. మంత్రివర్గంలో తాజా మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కుమారులకు కూడా చోటు దక్కింది.

అయితే ప్రమాణ స్వీకారానికి ముందు డీకేఎస్‌కు ఫోన్లో సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం బుధవారం అట్టహాసంగా జరిగింది. దీంతో గత మూడు సంవత్సరాలుగా కాంగ్రెస్ రాష్ట్రప్రభుత్వంలో చేటుచేసుకున్న ట్విస్ట్‌లకు ఎట్టకే లకు తెరపడింది.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్‌సింగ్‌సూర్జేవాలా, తెలంగాణ, కేరళ సీఎంలు రేవంత్‌రెడ్డి, వీడీ సతీశన్, డిప్యూటీ ససీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీఎంలు, పలువురు అగ్రశ్రేణి కాంగ్రెస్‌నాయకులు హాజరయ్యారు.

తెలగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభార్, అజారుద్దీన్ హారయ్యారు. వివిధ మఠాల అధిపతులతో సహా, అన్ని ప్రధాన మతాల మత గురువులు కూడా విచ్చేశారు. ప్రత్యేక ఆహ్వానితుల లో శివకుమార్ స్వగ్రామమైన కనకపురంలోని దొడ్డాలహళ్లిలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. కార్మికులు, పారిశుధ్య కార్మికులు, రైతు నాయకులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, కన్నడ అనుకూల సంస్థలతో సహా సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 

మంత్రులు వీరే.. 

మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీష్ జార్కిహోళి, కృష్ణ బైరేగౌడ, ప్రియాంక్ ఖర్గే, యూటీఖాదర్, ఈశ్వర్ ఖండ్రే, యతీంద్ర సిద్ధరామయ్య, బైరతి సురేష్, శరణ్ ప్రకాష్‌పాటిల్ ఉన్నారు. ఖాదర్, యతీంద్ర మినహా, మిగిలిన వారందరూ గత సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా పనిచే శారు. ఖాదర్ గతంలో కర్ణాటక స్పీకర్‌గా వ్యవహరించారు. ఎమ్మెల్సీ యతీంద్ర, మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు. 

మంత్రులుగా మల్లికార్జునఖర్గే, సిద్ధరామయ్య తనయులు

సీఎం డీకేఎస్ మంత్రివర్గంలో అందరూ ఊ హించినట్లే తాజా మాజీ సీఎం సిద్ధరామయ్య, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికా ర్జున ఖర్గే కుమారులైన యతీం ద్ర సిద్ధరామయ్య, ప్రియాంక్‌ఖర్గేకు అవకా శం దక్కింది. తన తండ్రి ప్రభ్వుత్వంలో యతీంద్ర శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. ప్రియాంక్‌ఖర్గే కుచిత్తాపూర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సిద్ధరామయ్య మంత్రి వర్గంలో 2023 మే 20న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేశా రు. వీరికి ఇంకా శాఖలు కేటాయించలేదు.

సోనియాగాంధీ శుభాకాంక్షలు 

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆమె ఈ అభినందనలు తెలియజేసినట్లు డీకేఎస్ పేర్కొన్నారు. అందరినీ కలుపుకుపోతా నని తాను సోనియాకు హామీ ఇచ్చినట్లు శివకుమార్ తెలిపారు. ‘సోనియా గాంధీ నాతో ఫోన్లో మాట్లాడారు. మొదటి నుంచీ ఆమెకు నాపై ఎంతో నమ్మకం ఉంది.

ఆమె నన్ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఆమె నాకు శుభాకాంక్షలు తెలిపి, అందరినీ కలుపుకుపోవాలని సూచించారు. ఆమెకు నాపై విశ్వాసం ఉంది. నేను అందరినీ కలుపుకుపోతానని ఆమెకుహామీ ఇచ్చాను,‘ అని శివకు మార్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

గతంలోనూ డిప్యూటీసీఎంగా, హోంమంత్రిగా పరమేశ్వర 

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీ పరమేశ్వర బుధవారం డీకేఎస్ శివకుమార్ మంత్రివ ర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన పరమేశ్వర, మే 2018 నుంచి జూలై 2019 వరకు ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆధ్వర్యంలోని కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిగా కూడా చేశారు. ఒక ప్రముఖ దళిత నాయకుడైన పరమేశ్వర, 2010, 2018 మధ్య కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా వరుసగా ఎనిమిదేళ్ల పాటు సేవలందించారు.

‘విశ్వవాణి’లో శివుడిగా డీకేఎస్.. తీవ్ర వివాదాస్పదం

శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముందు కర్ణాటక వార్తాపత్రిక విశ్వవాణి మొదటి పేజీలో డీకేఎస్‌ను శివుడిగా చిత్రీకరిస్తూ.. ప్రధాన కథనం బుధవారం రావడం తీవ్ర వివాదస్పందంగా మారింది. ప్రజలు దానిని ఒకపక్క దైవదూషణ చర్యగా, మరోపక్క రాజకీయ పొగడ్తగా పేర్కొంటున్నారు. అంతేకాదు సదరు కన్నడపత్రిక సోషల్‌మీడియా లో కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ చిత్రీకరణ తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

విమర్శకులతో సహా చాలా మంది దీనిపై ‘దైవదూషణ’, ‘రాజకీయ భజన’ వంటి ఆరోపణలు చేస్తున్నారు. విశ్వవాణి తన ప్రధాన కథనంలో శివకుమార్‌ను జటాజూటం, పులిచర్మం వస్త్రాలు, త్రిశూలం, డమరుకంతో కూడిన హిందూ దేవుడైన శివుడిగా చిత్రీకరించింది. శివకుమార్‌ను హిందూ దేవుడైన శివుడిగా చిత్రీకరించడంపై తక్షణమే తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మతాన్ని రాజకీయ కీర్తితో కలపడానికి చేస్తున్న బాధ్యతారహితమైన ప్రయత్నంగా ప్రజలు అభివర్ణించారు.

కర్ణాటకకు చెందిన న్యాయవాది గిరీష్ భరద్వా జ్ కూడా ఇది ‘ధర్మానికి విరుద్ధమని, మన దేవుళ్ల పవిత్రతను దెబ్బతీస్తుందని’ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘ఎంత పతనం. మాజీ తిహార్ ఖైదీ అయిన వ్యక్తిని హిందూ దేవుడితో పోల్చడం. కొందరు ఎంతకైనా దిగజారగలరు’ అని బెంగళూరు జీవశాస్త్ర ప్రొఫెసర్ గిరిధర్ ఉపాధ్యాయ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 

విద్యార్థులు, నిరుద్యోగులకు ఉచిత బస్‌పాస్: సీఎం డీకే 

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే డీకే శివకుమార్ తన మార్క్ పరిపాలనను మొదలు పెట్టారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉచిత బస్ పాస్‌లు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పోస్టుల భర్తీకి ప్రతీయేటా క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్‌లు ఏర్పాటు చేస్తామ న్నారు. రైతుల వలసలను అరికట్టేందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.

దేవెగౌడ, సిద్ధరామయ్య, యడియూరప్పకు ఆహ్వానం

తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ప్రధాని దేవెగౌడ, తాజా మాజీ సీఎం సిద్ధరామయ్య, మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడియూరప్పను  డీకే శివకుమార్ ఆహ్వానించారు.  ఆయన ప్రమాణ స్వీకారిని కొన్ని నిమిషాల ముందు, శివకుమార్ సిద్ధరామయ్య నివాసమైన ‘కావేరి’కి వెళ్లి, ఆయనకు కృతజ్ఞత లు తెలిపారు. ఆ తర్వాత యడియూరప్ప నివాసానికి వెళ్లి, ఆయన్ని కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరులతో డీకేఎస్ మాట్లాడుతూ.. ‘వారు రాష్ట్రానికి మార్గనిర్దేశం చేశారు, రాష్ట్రం కోసం పనిచేశారు.

రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదప డ్డారు. మనమందరం కలిసి పనిచేయాలి’ అని అన్నారు. తర్వాత  జేడీ(ఎస్) అగ్రనేత దేవెగౌడను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. దేవెగౌడ నివాసం వెలుపల డీకేఎస్ మీడియాతో మాట్లాడారు. ‘దేవెగౌడ, యడియూరప్ప మన రాష్ట్రానికి అపారమైన సేవ లు అందించారు. ఇతర ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రానికి సేవలు చేశారు; నేను వారిని కూడా కలుస్తాను. వారు ఎల్లప్పుడూ రాష్ట్ర గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడారు, ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు.

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, నేను ఎల్లప్పుడూ పెద్దల మార్గనిర్దేశాన్ని కోరుతాను’ అని స్పష్టం చేశారు. దేవెగౌడకు ఉన్న అపారమైన అనుభవం రాష్ట్రానికి గొప్ప బలం అన్నారు. ఆ మాజీ ప్రధాని తనకు మంచి మార్గనిర్దేశం చేశారని తెలిపారు. అంతకన్నా ముందు డీకేఎస్ తన తల్లికి పాదాభివం దనం చేసి, ఆశీర్వాదం తీసుకున్నారు.