9 May, 2026 | 2:40 AM

బీసీలకు పదవులు అడిగే హక్కు లేదా..?

09-05-2026 01:16 AM

పదవులు అడిగితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా..

మహబూబాబాద్, మే 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ 15 ఏళ్లుగా పార్టీ పటిష్టత కోసం పాటుపడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి బీసీకి ఇవ్వాలని అడిగితే, అగ్రవర్ణాలకు కట్టబెట్టి, పదవి ఇవ్వాలని అడిగినందుకు పార్టీ నుండి సస్పెండ్ చేశారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఉత్తమటేనా అని యువజన కాంగ్రెస్ నాయకుడు పెరుమాండ్ల చరణ్ గౌడ్ ప్రశ్నించారు.

మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంలో బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, కాంగ్రెస్ పార్టీ కోసం 2011 నుండి నిరంతరం పోరాడుతున్న ఎన్ ఎస్ యు ఐ, యువజన కాంగ్రెస్  కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని శాంతియుతంగా డిమాండ్ చేసినందుకు నాపై ఇండియన్ యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవి నుండి ఎటువంటి షోకాజ్ నోటీసు లేకుండా, వివరణ కోరకుండా, అంతర్గత విచారణ నిర్వహించకుండా సస్పెన్షన్ విధించడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమన్నాడు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని, బీసీ యువతకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గౌరవం ఇస్తామని ప్రకటించారు. కానీ నేడు వాస్తవ పరిస్థితుల్లో మాత్రం బీసీ వర్గాలకు న్యాయం జరగడం లేదని, నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీ యువతకు అవకాశాలు దక్కడం లేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన అనుబంధ సంఘాల కార్యకర్తలను పక్కన పెట్టారని ఆరోపించారు.

మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంపై నేను చేసిన నిరసన పూర్తిగా శాంతియుతం, ప్రజాస్వామ్యబద్ధమైనదని, బీసీ సమాజానికి న్యాయం చేయాలని, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేశానన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం దక్కేంతవరకు తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు.