9 May, 2026 | 3:35 AM

జూట్ బ్యాగుల తయారీ శిక్షణ శిబిరం ప్రారంభం

09-05-2026 01:15 AM

సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రభుత్వం కీలక అడుగు

మహబూబాబాద్, మే 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జూట్ బ్యాగుల తయారీ శిక్షణ శిబిరాన్ని కొత్తగూడ ఎంపీడీవో మున్వర్ ఘనంగా ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలనే లక్ష్యంతో మండల స్థాయి సమావేశంలో కీలక తీర్మానాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

సింగిల్ యూస్ ప్లాస్టిక్ నియంత్రణ, నిర్మూలనకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత జూట్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. వరంగల్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ 14 రోజులపాటు కొనసాగనుందని, ఈ శిబిరంలో మొత్తం 35 మందికి 15 రకాల జూట్ బ్యాగుల తయారీలో ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందించనున్నారు.

అంతేకాకుండా జూట్ బ్యాగుల తయారీ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు, తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి లాభాలు ఆర్జించే విధానాలపై కూడా అవగాహన కల్పించనున్నారు..పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎం పీ వో రామకృష్ణ, ఏ పి ఎం రవీందర్, వీ వో ఏ సభ్యులు, ట్రైనర్ అనిత తదితరులు పాల్గొన్నారు.