18 August, 2026 | 4:49 AM

దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావివ్వొద్దు

18-08-2026 02:16 AM

ఐటీడీఏ పీవో  బి రాహుల్

భద్రాచలం టౌన్, ఆగస్టు 17, (విజయక్రాంతి): ఏజెన్సీ ఏరియాలోని గిరిజనులు వివిధ సమస్యల అందజేసే దరఖాస్తుల విషయంలో   ఐటిడిఏ యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు. సోమవారం  ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ఏజెన్సీ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుండి విన్నపాలు,

ఇతర సమస్యల దరఖాస్తులను ఎస్ డి సి ఆనంద్ కుమార్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని  చందన , ఏ డి ఎం హెచ్ ఓ సైదులు, ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్ తో కలిసి స్వీకరించారు. భూ సమస్యలు, పోడు పట్టాల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, పెన్షన్లు, గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రత తదితర సమస్యలను గిరిజనులు ఐటీడీఏ పిఓ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ, గిరిజన దర్బార్ కార్యక్రమం గిరిజనుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కల్పించిన అత్యంత కీలక వేదిక అని అన్నారు.

గిరిజనుల నుంచి అందిన ప్రతి విన్నపాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా సంబంధిత శాఖల యూనిట్ అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. గిరిజన కుటుంబాల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి ఎలాంటి అవకాశం ఉండకూడదని అన్నారు.ప్రతి విన్నపాన్ని పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖల యూనిట్ అధికారులకు వెంటనే పంపించి, గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  గిరిజనులకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు ప్రతి యూనిట్ అధికారి కృషి చేయాలని సూచించారు.