సైబర్ అవగాహనలో ప్రతిభచాటిన గీతం విద్యార్థులు
‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా పురస్కారం
పటాన్ చెరు, ఆగస్టు 17 : ఆన్ లైన్ సైబర్ నేరాలను నిరోధించేలా నిర్వహించిన రాష్ట్ర స్థాయి షార్ట్ వీడియో, రీల్ పోటీలో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు అగ్రస్థానం సాధించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) తన స్పార్క్ (అవగాహన, బాధ్యతాయుతమైన సైబర్ స్పేస్ కోసం విద్యార్థి కార్యక్రమం)లో భాగంగా ‘సురక్షా కా తిరంగా: అప్రమత్తంగా ఉండండి, క్షుణ్ణంగా తెలుసుకోండి, సైబర్ సురక్షితంగా ఉండండి’ పేరిట బంజారాహిల్స్ లోని ఇంటిగ్రెటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఈ పోటీలను నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున, తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ సి.వి. ఆనంద్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, హైదరాబాదులో పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ సహా పలువురు ప్రముఖులు, సీనియర్ పోలీసు అధికారులు హాజరయ్యారు.
‘మోసాల నుంచి స్వేచ్ఛ’ అనే ఇతివృత్తంతో స్వాతంత్య్ర దినోత్సవ సైబర్ అవగాహన ప్రచారంలో భాగంగా, విద్యార్థులు, ప్రజలు సురక్షితమైన డిజిటల్ పద్ధతులను అవలంబించేలా, సైబర్ బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండేలా ప్రోత్సహించడానికి, ఆన్ లైన్ మోసాలను నివారించడంపై అవగాహన కల్పించడానికి టీజీసీఎస్బీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లఘు వీడియో, రీల్ పోటీని నిర్వహించింది.






