10 April, 2026 | 5:39 PM

నల్లమల సాగర్‌కు అనుమతులు వద్దు

14-12-2025 01:24 AM
  1. పోలవరం పేరు మార్చి నల్లమలను తెరపైకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం 
  2. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు కర్ణాటక యత్నం
  3. భూ సేకరణకు రూ. 70 వేల కోట్ల నిధులు కేటాయించింది
  4. కేంద్రానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ

హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాతిపాదిస్తున్న నల్లమల సాగర్ ప్రాజెక్టు, ఆల్మట్టి డ్యామ్  కోసం కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణకు అనుమతులు నిరాకరించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావును రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటి కేటాయింపులు, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు కోరుతూ ఆయనకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  లేఖ రాశారు.

గోదావరి నీటిని తరలించేందు కు ఏపీ ప్రభుత్వం కొత్తగా నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధ్దమవుతోందని, ఇది బచావత్ ట్రైబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా ఉందని మంత్రి  తన లేఖలో పేర్కొన్నారు. గతంలో పోలవరం  ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగా, ప్రీ ఫీజిబిలిటి నివేదికను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ తిరస్కరించినట్లు గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టు స్థానంలోనే తాజాగా నల్లమల సాగర్ నిర్మాణానికి డీపీఆర్ తయారీకి ఏపీ ప్రభుత్వం టెండర్  నోటీసు విడుదల చేసిందని మంత్రి పేర్కొన్నారు.

గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్ తీర్పులో ‘ వరద జాలులు లేదా మిగులు జలాలు ’ అనే పదం గురించి ప్రస్తావించలేదన్నారు. అంతర్రాష్ట నదీపై ఏదైనా ప్రాజెక్టులు నిర్మించాలంటే మిగతా రాష్ట్రాల సమ్మతి కూడా ఉండాలన్నారు. మహారాష్ట్రలోని విదర్భ, మరఠ్వాడ ప్రాంతాల్లో కరువు పీడిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ ప్రాంతాలకు గోదావరి వరద జాలాలను మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లించుకుంటుందన్నారు.

వరద ఆధారిత ప్రాజెక్టుల అంచనాలను పరిగణలోకి తీసుకోవడానికి సీడబ్ల్యూసీ లేదా జలశక్తి మంత్రిత్వ శాఖకు వద్ద ఉన్న మార్గదర్శకాలను మహారాష్ట్రకు తెలియజేయాలని కోరారు.  కర్ణాటక ప్రభుత్వం కూడా గోదావరి నీటికి బదులుగా 112 టీఎంసీల కృష్ణానదీ నీటీని మళ్లించుకోవాలని చూస్తోందని మంత్రి తెలిపారు.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనలతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్ల నుంచి ఎగువు రాష్ట్రా లు అదనపు జలాలను తీసుకుంటే  తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటి కే వీటన్నింటిపైన తెలంగాణ ప్రభుత్వం నిర్దిష్టమైన ఆధారాలతో అభ్యంతరం వ్యక్తం చేసిం దని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. 

ఆల్మట్టి ఎత్తుకు అనుమతులు ఇవ్వొద్దు

 కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్‌ను 524.256 మీటర్ల ఎత్తుకు పెంచేందుకు భూ సేకరణ కోసం రూ. 70 వేల కోట్లు కేటాయించి ముందుకు  సాగుతోందని తెలిపారు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ అమలులో ఉందనే విషయం గమనించాలని, ఆల్మట్టి ఎత్తును పెంచకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణలో ప్రాజెక్టులకు కృష్ణా నదీ జలాలలో తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. 

తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు ఇవ్వండి 

 2026- 2031 సంవత్సరాలకు గాను తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు పీఎంకేఎస్‌వై, ఏఐబీపీ కింద ఆమోదించాలని కోరారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే  రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలను ఎక్కువగా ప్రయోజనం కలుగుతుందన్నారు.  కృష్ణా ట్రైబ్యునల్-2 విచారణ త్వరగా పూర్తి చేసి ఈ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని కోరారు. పాలమూరు- రంగారెడ్డి తొలిదశ, సమ్మక్క సారక్క  ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇప్పటికే కేంద్ర జల సంఘానికి అందించామని మంత్రి తెలిపారు.

ఈ రెండు ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి రాసిన లేఖను రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బోజ్జా జలశక్తి కార్యదర్శికి అందజేశారు.  వీటితో పాటు 7460 మెగావాట్లకు సంబంధించి 5  గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను రూ. 45,650 కోట్ల వ్యవయంతో  ప్రయివేట్ కంపెనీలు నిర్మించేందుకు ప్రాతిపాదనలు చేసినట్లు చెప్పారు. 

ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించండి.. 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు,  నారాయణ్‌పేట్- కొడంగల్ లిప్ట్ లిప్ట్ ఇరిగేషన పథకం, ఇంటిగ్రేటెడ్  సీతారామ లిప్ట్ ఇరిగేషన్, సీతమ్మసాగర్ బహుళార్దసాదక ప్రాజెక్టు,  పాలమూరు-రంగారెడ్డి లిప్ట్ ఇ రిగేషన్ పథకం,  ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం)  లిప్ట్ ఇరిగేషన్ పథకం,  మోడికుం ట వాగు ప్రాజెక్టు,  చనాక- కొరాట (డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్)  తదితర ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు.