23 March, 2026 | 2:16 AM

మా గూడు చెదరగొట్టొద్దు

23-03-2026 12:57 AM
  1. మధు పార్క్ రిడ్జ్ చిన్నారుల పోస్టల్ కార్డ్ ఉద్యమం

ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డికి 5 వేల ఉత్తరాలు

పరీక్షల వేళ విద్యార్థుల మూడో రోజు నిరసన

డిజైన్ మార్చకుంటే ఢిల్లీ స్థాయిలో పోరాటం

ఇతర కాలనీల నుంచి వెల్లువెత్తిన మద్దతు

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22 (విజయక్రాంతి): రాహుల్ తాతా.. మీరు అంద రికీ న్యాయం చేస్తామంటారు కదా.. మరి మా ఇళ్లను ఎందుకు లాక్కుంటున్నారు.. మాకు ఇల్లు లేకపోతే మేము ఎక్కడ చదువుకోవాలి..ఎక్కడ పడుకోవాలి.. ప్లీజ్.. మా ఇళ్లను కాపాడండి..  ఇవి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక చిన్నారి పోస్ట్‌కార్డుపై వణికే చేతులతో రాసిన హృదయ విదారక వాక్యాలు.

మూసీ ప్రక్షాళనలో భా గంగా ప్రతిపాదించిన గాంధీ సరోవరం ప్రా జెక్టు ఇప్పుడు బండ్లగూడ జాగీర్ ప్రాంతంలోని వందలాది కుటుంబాల్లో చిచ్చు రేపు తోంది. తమ గూడు చెదిరిపోతుందన్న భ యంతో చిన్నారులు సైతం పోరుబాట పట్టా రు. పెద్దలు రోడ్ల మీద నిరసన తెలుపుతుం టే, చిన్నారులు నేరుగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరాల యుద్ధం ప్రారంభించారు.

వార్షిక పరీక్షల సమయంలో ఆటపాటలతో గడపాల్సిన వయసులో, చిన్నారులంతా గుంపులుగా కూర్చుని పోస్ట్‌కార్డులపై తమ ఆవేదనను అక్షరాలుగా మారుస్తున్నారు. ప్ర భుత్వం ఇస్తున్న భూసేకరణ నోటీసుల వల్ల తమ తల్లిదండ్రులు పడుతున్న మానసిక వేదనను చూసి చలించిపోయామని వారు చెబుతున్నారు. సేవ్ అవర్ హోమ్స్.. సేవ్ అవర్ ఫ్యూచర్ అంటూ రాహుల్ గాంధీకి రాసిన ఈ 5 వేల ఉత్తరాల్లో చిన్నారులు త మ నివాస ప్రాధాన్యతను వివరించారు. రాహుల్ గాంధీ నిరంతరం న్యాయం గురిం చి మాట్లాడుతుంటారని, అందుకే తమకు కూడా న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. 

ప్రస్తుతం వార్షిక పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు ఈ నోటీసుల వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మూసీ పునరుజ్జీవనం, గాంధీ సరోవరం అభివృద్ధి మంచిదే అయినా, 15 ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో వేల కోట్లు వెచ్చించి కొనుక్కున్న తమ ఇళ్లను కూల్చివేసి ప్రాజెక్టులు కట్టడం ఎంతవరకు సమంజసమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మధు పార్క్ రిడ్జ్ నివాసితులకు హైదర్షాకోట పరిసరాల్లోని మరో అరడజను కాలనీల వాసులు బాసటగా నిలిచారు. ముసీ జన ఆందోళన అనే పౌర సంఘం ప్రతినిధులు కూడా ఈ నిరసనలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.  తమ విన్నపాన్ని మన్నించకపోతే ఈ ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తామని నివాసి తులు హెచ్చరిస్తున్నారు.