calender_icon.png 21 January, 2026 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలాన్ల కోసం ఆపొద్దు.. తాళాలు లాగొద్దు

21-01-2026 12:06:35 AM

  1. వాహనదారులను బలవంతం చేయకూడదు 

డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడం చట్ట విరుద్దం

చట్టపరంగా వసూలు చేసుకోవాలే తప్ప.. జబర్దస్దీ వద్దు

పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

ట్రాఫిక్ చలాన్ల పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ 

పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 20 (విజయక్రాంతి): పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. పెండింగ్ చలాన్లను క్లియర్ చేయాలంటూ వాహనదారులను బలవంతం చేయొద్దని పోలీసులను ఆదేశించింది. ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల విషయంలో పోలీసులు అనుసరిస్తున్న విధానాలపై దాఖలైన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా వాహనదారులకు ఊరటనిచ్చేలా కీలక ఆదేశాలు జారీ చేసింది. తాళాలు లాక్కోవడం కుదరదు..

రోడ్లపై వాహనాలను ఆపి, పెండింగ్ చలాన్లు ఉన్నాయనే కారణంతో వాహనాల తాళాలు లాక్కోవడం, అక్కడికక్కడే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడం చట్టవిరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది. వాహనదారుల అనుమతి లేకుండా, వారిని ఆపి నిర్బంధంగా చలాన్లు కట్టించుకునే అధికారం పోలీసులకు లేదని తేల్చిచెప్పింది.ఒకవేళ వాహనదారుల నుంచి పెండింగ్ చలాన్లు వసూలు చేయాలని పోలీసులు భావిస్తే..

దానికి ఒక పద్ధతి ఉందని కోర్టు సూచించింది. సంబంధిత వాహనదారులకు కోర్టు ద్వారా నోటీసులు పంపించి, న్యాయప్రక్రియ ద్వారానే వసూలు చేసుకోవాలని తెలిపింది. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించకూడదని హెచ్చరించింది.అయితే, వాహనదారులు తమంతట తాముగా ముందుకొచ్చి పెండింగ్ చలాన్లు చెల్లించాలనుకుంటే అభ్యంతరం లేదని, వారు స్వచ్ఛందంగా చెల్లించవచ్చని కోర్టు పేర్కొంది. కానీ, పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతపు వసూళ్లకు పాల్పడవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో నిత్యం ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలతో సతమతమయ్యే నగర వాహనదారులకు భారీ ఊరట లభించినట్లయింది.