21 July, 2026 | 11:23 AM

ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా..?

21-07-2026 12:00 AM

కాంగ్రెస్ నేత బోయపల్లి రాఘవేందర్ రెడ్డి

బడంగ్‌పేట్, జూలై 20 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్‌ఎస్ నాయకులకు లేదని, పదేళ్ల పాలనలో చేసిన వాగ్దానాలు, వైఫల్యాలపై కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఏఐసిసి విచార్ విభాగ్ కో ఆర్డినేటర్, సీనియర్ నాయకులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బిఆర్‌ఎస్ ఎన్నికల హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం కేసీఆర్కు ఉందా అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన పలు ప్రశ్నలు సంధించారు: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలతో యువత జీవితాలతో ఆడుకున్నారని, నిరుద్యోగ భృతి హామీని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. దళితుడిని తొలి సీఎం చేస్తామన్న మాట ఏమైందని, ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామన్న హామీ ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. పేదల కలల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య నినాదాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.

పదేళ్లలో తెలంగాణను లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి, ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టింది కేటీఆర్ అని అన్నారు. అధికారం కోల్పోయిన బాధతోనే కేసీఆర్, కేటీఆర్లు వాస్తవాలను పక్కనబెట్టి ప్రభుత్వంపై నిరాధార విమర్శలు చేస్తున్నారని, ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోవాలని రాఘవేందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుర్రం లింగారెడ్డి, సత్యనారాయణ రావు, ఆర్ల నరసింహ, గుర్రం నరసింహారెడ్డి, పూల్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.