21 July, 2026 | 11:08 AM

ఇసుక దందాపై గోదారమ్మ కన్నీటి గోస

21-07-2026 12:00 AM
  1. కాంట్రాక్టర్ల కోట్లలో లాభాలు.
  2. కూలీలుగానే సొసైటీ సభ్యులు !
  3. ఒక పంచాయతీలో పర్మిషన్.. వేరే పంచాయతీలో డంపింగ్ !.
  4. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరవు.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం.

పినపాక, జూలై 20, (విజయక్రాంతి): జీవనది గోదావరి ఇసుక దందాతో కన్నీరు పెడుతోంది. కొందరు రేంజింగ్ కాంట్రాక్టర్ల స్వలాభం కోసం నదీ గర్భాన్ని ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ, ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. స్థానిక గిరిజన లేదా మత్స్యకార సొసైటీల పేరిట అనుమతులు పొంది, తీరా క్షేత్రస్థాయిలో మాత్రం సొసైటీ సభ్యులను కేవలం కూలీలుగా మారుస్తూ కాంట్రాక్టర్లు కోట్లు గడిస్తున్నారు. సొసైటీ సభ్యులను వాడుకుంటున్నారు.. 

పేరు సొసైటీ ది..లాభాలన్నీ కాంట్రాక్టర్లవీ

నిజానికి స్థానిక సొసైటీ సభ్యులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుక క్వారీ నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగిస్తుంది. కానీ, ఇక్కడే అసలు కథ నడుస్తోం ది. బడా కాంట్రాక్టర్లు తెరవెనుక ఉండి సొసైటీ సభ్యులను పావులుగా వాడుకుంటున్నారు. పెట్టుబడి వారిదే.. శ్రమ వీరిదే క్వారీ నిర్వహణ, రవాణా అంతా కాంట్రాక్టర్లే చూసుకుంటూ, సొసైటీ సభ్యులకు కేవలం రోజువారీ కూలీ మాత్రమే ఇస్తున్నారు. కోట్లలో లాభాలు ఇసుక అమ్మకాల ద్వారా వచ్చే అసలు సిసలైన లాభాలన్నీ కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తుండగా, సొసైటీ సభ్యులు మాత్రం ఎండనక, వాననక రెక్కల ముక్కలు చేసుకుంటూ కూలీలుగానే మిగిలిపోతున్నారు.

రూల్స్ బ్రేక్.. ఒక చోట పర్మిషన్, మరోచోట డంపింగ్!

ఈ ఇసుక మాఫియా అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. పినపాక మండలం లో ఒక పంచాయతీ పరిధిలో ఇసుక తవ్వకాలకు అనుమతులు (పర్మిషన్లు) తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా వేరే పంచాయతీ పరిధిలోకి వెళ్లి ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. అనుమతి ఉన్న ప్రాంతం కంటే నాలుగింతలు ఎక్కువగా నదీ గర్భాన్ని తవ్వేస్తూ, ఆ ఇసుకను పక్క పంచాయతీల్లోని ప్రైవేటు భూముల్లో అక్రమంగా డంపింగ్ చేస్తున్నారు. దీనివల్ల స్థానిక రోడ్లు ధ్వంసమవడమే కాకుండా, భూగర్భ జలాలు పడిపోయి పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.    

ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరవు!

ఈ అక్రమ రవాణా, డంపింగ్ వ్యవహారం బహిరంగంగానే సాగుతున్నా.. మైనింగ్, రెవెన్యూ, శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి అందుతున్న ’మామూళ్ల’ వల్లే అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, గోదావరి నదిని కాపాడటంతో పాటు సొసైటీ సభ్యులకు జరుగుతున్న శ్రమ దోపిడీని అరికట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు.