ప్రశ్నలడిగితే ఎగతాళి చేస్తారా?
- సమస్యలడిగితే అసెంబ్లీలో గొంతు నొక్కారు
- ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీజేపీ
- తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటున్న జాతీయ కాంగ్రెస్
- బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): అసెంబ్లీలో ప్రశ్నలు అడిగితే ఎగతాళి, ఎదురుదాడి చేశారని, ప్రజా సమస్యలను అడిగితే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌ను ఏటీఎంలా జాతీయ కాంగ్రెస్ వాడుకుంటుదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందని, రోజూ అప్పు చేస్తే కానీ గడవని పరిస్థితి రాష్ట్రానిదని పేర్కొన్నారు.
బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడారు. వందేమాతరం గేయాన్ని అవమానించిన వారిని డిస్ క్వాలిఫై చేయాలి, కానీ వారిని ఫ్యానెల్ స్పీకర్‌గా కూర్చోబెట్టి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందన్నారు. కాగ్ లెక్కలు చూస్తే బడ్జెట్‌లో పెట్టిన అంకెలు ఖర్చు పెట్టట్లేదని తేలిందన్నారు.
నిధులు ఇవ్వకుండా బీసీ, ఎస్సీ ఎస్టీల హక్కులు కాలరాస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచే మూటలు వెళ్తున్నాయని, మూటల కోసమే తెలంగాణ నేతలను ఐదు రాష్ట్రాల ఎన్నికల ఇంచార్జిలుగా వేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని, బీఆర్‌ఎస్‌పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ మాటలకే పరిమితం అయిందన్నారు.
బీఆర్‌ఎస్‌ను కాపాడుతున్నది కాంగ్రెస్సే అని, ఢిల్లీ కాంగ్రెస్ ద్వారా ఇక్కడి కాంగ్రెస్‌ను బీఆర్‌ఎస్ ఆడిస్తుందన్నారు. రూ.లక్ష కోట్లు అవినీతి జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరకుండా, కేవలం రూ.10 వేల కోట్ల విలువైన బ్యారేజీ పనులపైనే సీబీఐ విచారణను కోరడం వెనుకు ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. సర్పంచులు, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు పరిష్కారం కాలేదన్నారు.
రాష్ట్రంలో 53 వేల ఎకరాల ఇండస్ట్రీయల్ ల్యాండ్ బ్యాంక్ ఉంటే, 2014 నుంచి దీనిపై సర్వేలు నిర్వహించలేదని కాగ్ హెచ్చరించిందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సంగప్ప, కప్పర ప్రసాదరావు, మీడియా ప్యానెలిస్టు రాజు, ప్రభా గౌడ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




