1 April, 2026 | 2:31 AM

రోడ్డు భద్రతకు ప్రాధాన్యత

01-04-2026 12:03 AM

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఉచిత కంటి వైద్యశిబిరం

దేవరకొండ, మార్చి 31 : ప్రమాదాల నివారణే లక్ష్యంగా నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో చేపట్టిన ’అలైవ్... అరైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపళ్లి గ్రామంలో లారీ డ్రైవర్లు, క్లీనర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్వయంగా ప్రారంభించి డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘ ప్రయాణాలు చేసే భారీ వాహన డ్రైవర్లకు కంటి చూపు అత్యంత కీలకమని చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, కొండమల్లేపల్లి సీఐ నవీన్ కుమార్, ఎస్‌ఐ అజ్మీరా రమేష్, గ్రామ సర్పంచ్ పందుల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. సామాజిక బాధ్యతతో పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.