calender_icon.png 4 February, 2026 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రికి వచ్చే రోగులపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి

04-02-2026 02:02:05 AM

ఐటీడీఏ పీవో బి. రాహుల్

బూర్గంపాడు, ఫిబ్రవరి3, (విజయక్రాంతి): మారుమూల గిరిజన గ్రామాల నుండి సిహెచ్ సి ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపి అన్ని రకాల టెస్టులు నిర్వహించి తప్పనిసరిగా వైద్య సేవలు అందించాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ సూచించారు.

మంగళవారం బూర్గంపాడు ప్రభుత్వ సిహెచ్ సి వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం లేబరేటరీ, ఆపరేషన్ థియేటర్, గర్భిణీ స్త్రీల కాన్పుల గది, అవుట్ పేషెంట్ల గది, అల్ట్రా సౌండ్ స్కానింగ్ గది, మందులు నిలువచేసే గది,రోగులకు అందుతున్న స్కానింగ్ సేవలు, అవుట్ పేషెంట్లు, ఇన్ని పేషెంట్ల, స్టోర్ రూమ్ లో ఉన్న మందుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సౌకర్యాల గురించి అవుట్ పేషెంట్లను మరియు వార్డులలో వైద్య సేవలు పొందుతున్న పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాలనుండి వివిధ రకాల జబ్బులకు వైద్యం చేయించుకోవడానికి గిరిజనులు వస్తూ ఉంటారని, వారికి సరైన వైద్యం చేసి మందులు అందజేయాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

ఉపాధ్యాయుల పనితీరుపై పీవో ఆగ్రహం 

మండలంలోని ఉడ్ యార్డ్ జిపిఎస్ పాఠశాలను ఐటీడీఏ పీవో బి రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఉద్దీపకం వర్క్ బుక్ లోని పదాలను ఇతర అంశాలను విద్యార్థుల చేత బోర్డుపై వ్రాయించి దానికి సంబంధించిన తాత్పర్యాలు పిల్లలను అడగారు. విద్యార్థులు సరైన సమాధానం చెప్పకపోవడంతో సంబంధిత ఉపాధ్యాయులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్నారుల విద్యాభ్యాసం బలోపేతం కావడానికి ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని, ఉద్దీపకం వర్క్ బుక్ లోని పదాలు విద్యార్థులు సరిగా చెప్పకపోవడం ఉపాధ్యాయుల పనితీరు ఎలా ఉందో అర్థమయిపోతుందని, ఈ నెలలో మరల ఈ పాఠశాలను సందర్శిస్తానని ఈ లోపల పిల్లలందరూ ఉద్దీపకం వర్క్ బుక్ లోని ప్రతి పదాలు, గుణకారాలు, భాగాహారాలు, చతుర్వేదికలు అన్ని పిల్లలు చెప్పే విధంగా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని, లేనియెడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

అనంతరం ఆశ్రమ పాఠశాలను సందర్శించి పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున విద్యార్థులందరినీ పరీక్షలు సక్రమంగా రాసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ డి ఎం హెచ్ ఓ సైదులు, పర్యవేక్షకుడు ముక్కంటేశ్వరరావు, డాక్టర్లు అనిత, నిషార్ సిహెచ్సి, స్థానిక సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ భజన సతీష్, ఆసుపత్రి సిబ్బంది  పాల్గొన్నారు.