3 April, 2026 | 8:52 PM

జవహర్ నగర్‌లో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

03-04-2026 06:50 PM

నివాళులర్పించిన సిపిఐ నాయకులు

జవహర్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ మట్టి పుత్రుడు, వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రాణాలర్పించిన తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో  సిపిఐ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జి తోట పెల్లి శంకర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు శంకర్ ఆయన త్యాగాలను స్మరించుకుంటూ, కొమురయ్య స్ఫూర్తితో ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని శంకర్ పిలుపునిచ్చారు.

సిపిఐ స్థానిక కార్యాలయం వద్ద ప్రధాన కూడళ్లలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ, నిజాం గడీల అహంకారాన్ని ఎదిరించి, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన పోరాటంలో కొమురయ్య చూపిన ధైర్యం చిరస్మరణీయమని కొనియాడారు. ఆశయ సాధన:1946 జూలై 4న కడివెండి గ్రామంలో దొరల ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఆయన బలిదానం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి అని వారు పేర్కొన్నారు. నేటి తరం ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లె పూల శ్రీకాంత్ యాదవ్, మహనీయులు ఉత్సాహ కమిటీ అధ్యక్షుడు మండల సురేందర్,పర్శరాము,నర్సింహా గౌడ్, నర్సింహా,సిపిఐ నగర కార్యదర్శులు, నేతలు, కార్మిక సంఘాల ప్రతినిధులు  పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జై కొమురయ్య.. జోహార్ దొడ్డి కొమురయ్య అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. దొడ్డి కొమురయ్య కేవలం ఒక కులానికో, వర్గానికో పరిమితమైన నాయకుడు కాదు.. ఆయన అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక" అని సిపిఐ నాయకులు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు