29 July, 2026 | 6:14 AM

బైడెన్ చెత్త ప్రెసిడెంట్.. కాదు నువ్వే!

27-05-2024 12:03 AM

డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కలు చూపించిన సభికులు

లిబర్టేరియన్ కన్వెన్షన్‌లో తీవ్ర అవమానం

వాషింగ్టన్, మే 26: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎన్నికల ప్రచారంలో ప్రజలు చుక్కలు చూపించారు. శనివారం రాత్రి లిబర్టేరియన్ కన్వెన్షన్‌లో ప్రసంగించేందుకు వెళ్లిన ఆయనను సభికులు ఓ ఆటాడుకున్నారు. అవమానం తట్టుకోలేక ప్రసంగం మధ్యలో చాలాసార్లు ట్రంప్ గట్టిగా అరిచారు. డిసెంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే లిబర్టేరియన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకొనేందుకు ఆ పార్టీ కన్వెన్షన్‌ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ట్రంప్‌ను ఆహ్వానించారు. నిజానికి ట్రంప్ విధానాలను కూడా లిబర్టేరియన్స్ తీవ్రంగా విమర్శిస్తారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను కన్వెన్షన్‌కు ఆహ్వానిం చటంపై ఆ పార్టీ నేతలు రెండుగా చీలిపోయారు. ఒకవర్గం ట్రంప్‌కు స్వాగతం పలుకగా, మరోవర్గం మాటలు, చేతలతో ఆయనను అవమానించారు. ట్రంప్ వేదికపైకి వెళ్లి మాట్లాడటం మొదలుపెట్టగానే సభికులు పెద్దపెట్టున అల్లరిచేశారు. అయినా ఆయన ప్రసంగం కొనసాగించారు. ఈ సభలో స్వాతంత్య్రానికి బలమైన మద్దతుదారులు ఉన్నారు అని లిబర్టేరియన్లను పొగిడేందుకు ట్రంప్ ప్రయత్నించారు. అయినా గొడవ సద్దుమణగలేదు. గొడవను పట్టించుకోకుండా ట్రంప్ మాట్లాడుతూ వెళ్లారు. ప్రస్తు దేశాధ్యక్షుడు జో బైడన్ నిరంకుశుడు, అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు అని ఆరోపించారు. దాంతో వెంటనే సభలో నుంచి ‘అది నువ్వే.. అది నువ్వే’ అనే నినాదాలు మార్మోగాయి. దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ గట్టిగా అరిచారు. ఆవేశంతో ఊగిపోతూ.. ‘మీరు (లిబర్టేరియన్స్) గెలువాలనుకోవటం లేదు. ఈసారి కూడా మూడుశాతంతోనే (గత ఎన్నికల్లో లిబర్టేరియన్ అభ్యర్థి గ్యారీ జాన్సన్‌కు 3 శాతం ఓట్లే వచ్చాయి) సరిపెట్టుకో వాలనుకొంటున్నారు అని మండిపడ్డారు. బైడెన్‌కు ప్రత్యర్థి అయిన లిబర్టేరియన్స్‌తో స్నేహం చేయటానికే తాను ఈ సభకు వచ్చినట్టు చెప్పారు. గందరగోళం మధ్యనే ప్రసంగం కొనసాగించి ముగించారు.