29 July, 2026 | 7:04 AM

రాజ్యాంగాన్ని తిరగరాస్తారు

27-05-2024 12:05 AM

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు ముస్లింలకు వెళ్తాయి

విద్యాసంస్థల్లో మెజారిటీ ప్రజలకు అన్యాయం చేస్తారు

కాంగ్రెస్, ఎస్పీపై ప్రధాని మోదీ ఆరోపణలు

మవూ (యూపీ), మే 26: ఇండియా కూటమి పార్టీలు రాజ్యాంగాన్ని తిరగరాసి మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తారని ప్రధా ని నరేంద్రమోదీ ఆరోపించారు. తద్వారా అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రజలను రెండో తరగతి పౌరులుగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్ పూర్వాం చల్ ప్రాంతంలోని ఘోసీ, మీర్జాపూర్ పట్టణాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారం లో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఇండియా కూటమి లాక్కొని ముస్లింలకు ఇస్తారని చెప్పారు. వివిధ కులా ల మధ్య గొడవలు సృష్టిస్తారని ధ్వజమెత్తారు. పూర్వాంచల్‌ను సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ చాలా ఏళ్లు విస్మరించాయని, అం దువల్ల ఈ ప్రాంతం మాఫియా, పేదరికానికి అడ్డాగా మారిందన్నారు. పూర్వాంచల్‌పై ఎస్పీ కుట్రపూరితంగా వ్యవహరించిందని, ఇక్కడి ప్రజలు వారిని ఎప్పటికీ శిక్షిస్తూనే ఉంటారని అన్నారు. ఇండియా కూటమికి చెందినవారు ఇక్కడి ప్రజల ఇళ్లు తగలబెట్టారని, భూములు ఆక్రమించుకున్నారని, గొడ వలు సృష్టించారని, అలాంటి వారిని పూర్వాంచల్‌లో అడుగుపెట్టనివ్వకూడదని పిలుపునిచ్చారు. ఈ పార్టీలు శాంతి భద్ర తలపై పగ పట్టాయన్నారు. మీర్జాపూర్ ప్రతి ష్ఠను ఎస్పీ దిగజార్చిందని ధ్వజమెత్తారు.  

దళితులకు ద్రోహం

ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల గత మ్యానిఫెస్టోలను ప్రస్తావిస్తూ.. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో దళితులకు అంబేడ్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల మాదిరిగా ముస్లింలకు కల్పిస్తామని ఎస్పీ చెప్పింది. అదేవిధంగా కాంగ్రెస్ మైనారిటీ విద్యాసంస్థలను నెలకొల్పి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. 2014కు ముందు రాత్రికిరాత్రే స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను మైనారిటీ సంస్థలుగా ప్రకటిస్తూ కాంగ్రెస్ చట్టం చేసింది. అక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు పూర్తిగా చెక్ పెట్టింది. అందువల్ల ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు. దళితులు, తెగలకు ఇంతకన్నా పెద్ద ద్రోహం ఏముంటుంది? ప్రపంచమంతా మన ఎన్నికలను గమనిస్తున్నారు. ఇక్కడ ఎంత బలమైన ప్రభుత్వం వస్తే అంత శక్తిమంతమైన ప్రధాని వస్తారు. ఆ ప్రతిధ్వని ప్రపంచంలోని ప్రతి దేశానికి వినిపిస్తుంది అని ఉద్ఘాటించారు. అంతేకాకుండా యాదవులను సమాజ్‌వాదీ పార్టీ విస్మరిస్తూ కేవలం ములాయంసింగ్ యాదవ్ కుటుంబసభ్యులకే టికెట్లు ఇస్తోందని ఆరోపిం చారు. దేశంలో బీజేపీ నేతృత్వంలోని బలమైన ఎన్‌డీఏ ప్రభుత్వం వస్తుందని, ఇతర పార్టీలకు ఓటు వేసి వృథా చేయొద్దని ప్రజలకు సూచించారు.