గుత్తాధిపత్యాన్ని ఒప్పుకోం
- సాంకేతికతలో కొన్ని దేశాల పెత్తనం
- అదే ప్రపంచ సమస్యలకు కారణం
- ఆఫ్రికా అభివృద్ధికి భారత్ సాయం
- జీ సమావేశాల్లో భారత ప్రధాని మోదీ
బారీ (ఇటలీ), జూన్ 14: అత్యాధునిక సాంకేతికతలపై కొన్ని దేశాల గుత్తాధిపత్యాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచం మొత్తాన్ని సమ్మిళిత సమాజంగా పునర్నిర్మించాలని పిలుపునిచ్చారు. ఇటలీలోని బారి ద్వీపంలో జరుగుతున్న జీ సమ్మిట్‌లో శుక్రవారం మోదీ ప్రసంగించారు. భూగోళంపైన దక్షిణ భాగంలో ఉన్న దేశాలు తీవ్ర అనిశ్చితిలో ఉన్నాయని, దీంతో ప్రపంచమంతా ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ప్రపంచ సుస్థిరత కోసం భారత్ ఎంతో చేస్తున్నదని తెలిపారు.
జీ కూటమికి అధ్యక్ష హోదాలో ఆఫ్రికా యూనియన్‌కు అందులో శాశ్వత సభ్యత్వం కల్పించామని, ఆఫ్రికా దేశాల సమగ్రాభివృద్ధికి భారత్ కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాకు అధిక ప్రాధాన్యమిస్తూ వ్యూహాత్మక రక్షణ సహకారాన్ని పెంపొందించేందు కు ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అంగీకరించారు. ఇటలీలోని అపులీయాలో జరుగుతున్న జీ సదస్సులో భాగంగా మోదీ, మేక్రాన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత్‌కు కీలకమైన వ్యుహాత్మక భాగస్వామిగా ఫ్రాన్స్ ఉంది. రెండు దేశాల మధ్య రక్షణ, భద్రతకు సంబంధించి చాలా ఒప్పందాలు జరిగాయి.
ప్రస్తుతం భారత నేవీ కోసం ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ జెట్లు పొందేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారత వాయు సేన కోసం 36 రఫేల్ జెట్లను ఫ్రాన్స్ అందించింది. జీ దేశాల్లో భారత్ భాగం కానప్పటికీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రత్యేక ఆహ్వానం మేరకు సదస్సుకు మోదీ అతిథిగా హాజరయ్యారు. అపులీయాలోని విలాసవంతమైన బోర్జో ఎగ్నాజియా రిసార్ట్‌లో జూన్ 13 నుంచి 15 వరకు ఈ సదస్సు జరుగుతోంది. మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా విదేశీ పర్యటనకు మోదీ వెళ్లారు. పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక చర్చల కోసం పలువురు అగ్రదేశాల నాయకులతో మోదీ సమావేశమవుతారు. మొదటి రోజు మేక్రాన్‌తోపాటు బ్రిటన్ ప్రధాని రుషి సునాక్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో భేటీతో మోదీ బిజీగా గడిపారు.
మేక్రాన్‌తో నాలుగోసారి..
మోదీ ఈ ఏడాది నాలుగోసారి మేక్రాన్‌తో భేటీ అయ్యారు. యువతలో ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహించే మార్గాలపై వీరు చర్చించారు. ఒక్క ఏడాదిలోనే నాలుగోసార్లు భేటీ కావడం భారత్, ఫ్రాన్స్ మధ్య బలమైన సంబంధాలకు సూచిక. రక్షణ, భద్రత, సాంకేతికత, ఏఐ, బ్లూ ఎకానమీ వంటి చాలా అంశాలపై చర్చించాం. వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యంలో ఇస్తున్న నేపథ్యంలో మేక్రాన్‌కు శుభాకాంక్షలు తెలియజేశా అని మోదీ ట్వీట్ చేశారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు మేక్రాన్ శుభాకాంక్షలు తెలియజేయగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2047 రోడ్‌మ్యాప్ లక్ష్యంగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించేందుకు రెండు దేశాలు అంగీకరించాయని వెల్లడించింది. 2025లో రెండు దేశాలు అతిథ్యమిచ్చే ఏఐ సదస్సు, యూఎన్ ఓషన్ కాన్ఫరెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని అందుకు సంబంధించిన రంగాల్లో సహకారాన్ని పెంచడానికి భారత్, ఫ్రాన్స్ అంగీకరించినట్లు పేర్కొంది.
సునాక్‌తో ఆలింగనం..
అంతకుముందు బ్రిటన్ ప్రధాని రుషి సునాక్‌తోనూ మోదీ సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు ఎదురుపడగానే మర్యాదపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం పెంచేందుకు అవసరమయ్యే అంశాలపై చర్చించారు. అంతర్జాతీయంగా కీలక అంశాలతో పాటు ప్రాంతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్‌స్కీతోనూ మోదీ సమావేశమయ్యారు. రష్యాతో ఘర్షణను దౌత్య చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించేందుకు తమ మద్దతు ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు. బైడెన్ వింత ప్రవర్తన..
సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వింతగా ప్రవర్తించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. జీ సభ్యదేశాల నేతలంతా గ్రూప్ ఫొటో దిగుతుండగా మిగతా నేతలు ఉన్నవైపు కాకుండా మరోవైపు తిరిగి ఎవరికోసమో వెతుకుతూ ముందుకు వెళ్లారు. అక్కడే ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించారు. కానీ, ఆయన ముందు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఆయన ఎంతసేపటికీ రాకపోవడంతో ఇటలీ ప్రధాని మెలోనీ వెళ్లి బైడెన్‌ను తీసుకువచ్చారు. ఆ తర్వాత సభ్య దేశాల నేతలతో బైడెన్ ఫొటో దిగారు. ఈ ఘటన దృశ్యాలు వైరల్ కావడంతో నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు.






