9 April, 2026 | 3:09 AM

వీసమెత్తు నష్టం జరుగొద్దు

01-12-2024 01:27 AM
  1. కృష్ణా నదీ పరీవాహకం తెలంగాణలో 70శాతం.. ఏపీలో 30శాతమే
  2. నదీ పరీవాహకం ప్రకారమే నీటి కేటాయింపులుండాలి 
  3. ఆ దిశలోనే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదించాలి
  4. అవసరమైన సాక్ష్యాలు, రికార్డులు సిద్ధంగా ఉంచుకోండి
  5. కృష్ణా జలాల్లో కోటాకు మించి ఏపీ తరలిస్తోంది 
  6. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ నిర్ణయాలను ఎందుకు పట్టించుకోవాలి 
  7. గోదావరి, కృష్ణా బోర్డుల జోక్యంపై సుప్రీంలో వాదనలు విన్పించాలి 
  8. నీటిపారుదల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): ‘అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకా రం నదీ పరీవాహక ప్రాంతాన్ని బట్టి అదే దామాషా ప్రకారం నీటి కేటాయింపులు ఉం డాలి. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణ లో 70 శాతం ఉండగా.. ఏపీలో కేవలం 30 శాతమే ఉంది.

అదే వాదనల ప్రకారం 1,005 టీఎంసీల్లో 70 శాతం నీటి వాటా తెలంగాణకు దక్కేలా వాదనలు వినిపించా లి’ అని సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను ఆదేశించారు. రాష్ట్రానికి వీసమెత్తు నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని సూచించా రు. నీటిపారుదల ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సంబంధిత అధికారులతో సీఎం శనివారం సమీక్ష  నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగు నీటి పరిస్థితి, కృష్ణా, గోదావరి జలాలపై ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిం చాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థంగా వా దనలు వినిపించాలని ఆదేశించారు. అందు కు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని అప్రమ త్తం చేశారు.

కాగా, రాష్ట్ర పునర్వ్యవస్థీకర ణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల నీటి వా టా లు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల ను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించా ల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తె చ్చా రు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలను, ఆధారాలను మాత్రమే ట్రిబ్యునల్ సేకరించిందని చెప్పారు.  

బోర్డుల జోక్యంపై సుప్రీం కోర్టుకు 

రెండు రాష్ట్రాల మధ్య నీటివాటాల పంపిణీని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇప్పటివరకు పూర్తి చేయనందున.. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీల నిర్ణయాలను ఎందుకు పట్టించుకోవాల ని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. నీటి వాటాల పంపిణీని ట్రిబ్యునల్ పూర్తిచేసేంతవరకు గోదావరి, కృష్ణా బోర్డుల జోక్యం ఉండకూడదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని ఆదేశించారు.

కోటాను మించి ఏపీకి నీటి తరలింపు  

వివిధ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాల్లో కోటాకు మించి ఎక్కువ నీటిని ఏపీ తరలిస్తోందని సమావేశంలో చర్చ జరిగింది. నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా లెక్కించే టెలీమెట్రీ విధానంతో దీనికి అడ్డుకట్ట వేసే వీలుందని అధికారులు సీఎంకు వివరించారు. టెలీమెట్రీ పరికరాలకు అయ్యే రూ.12 కోట్లను రెండు రాష్ట్రాలు చెరిసగం చెల్లించాలని తెలిపారు.

అవసరమైతే మొత్తం డబ్బులు ముందుగా భరించి, టెలీమెట్రీని అమల్లోకి తీసుకురావాలని, ఏపీ ఇచ్చినప్పుడు రీయింబర్స్‌మెంట్ చేసుకోవాలని సీఎం సూచించా రు. నీటి వినియోగం విషయంలో జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని  ఆదేశించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడు కుంటుందో.. లెక్కలు తీయాలని ఆదేశించా రు.

శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, బంకంచెర్ల హెడ్ రెగ్యులేటరీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగోడు ప్రా జెక్టుల నుంచి ఎంత నీటిని తరలిస్తున్నారనే వివరాలన్నీ రికార్డు చేయాలని సీఎం స్పష్టంచేశారు. సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యా రేజీకి అవసరమైన అనుమతులు తీసుకోవాలని, పూర్తి ఆయకట్టుకు నీరందించేందుకు అవసరమైన పనులన్నీ తొందరగా చేపట్టాల ని సూచించారు.

ప్రాజెక్టుల నీటి వాటాలకు సంబంధించి సమర్థంగా వాదనలు వినిపించేందుకు 2014 నుంచి ఇప్పటివరకు ఉన్న జీవోలు, తీర్పులే కాకుండా ఉమ్మడి రాష్ట్రం లో ఇచ్చిన జీవోలు, మెమోలు, ప్రాజెక్టుల డీపీఆర్‌లు, అప్పటి నుంచి నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన నష్టాలపై సమగ్రంగా నివేదిక తయారుచేయాలని ఆదేశించారు.

వీటి ఆధారంగా అన్ని వేదికలపై తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేలా వాదనలు వినిపించాలని స్పష్టంచేశారు. సమావేశంలో స్టాండింగ్ కౌన్సిల్ వైద్యనాథన్, ఏజీ సుదర్శన్‌రెడ్డి, అడిషనల్ ఏజీ రజనీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది ఖుష్‌వోరా, సాగునీటి సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, సీఎం సెక్రెటరీ మాణిక్‌రాజ్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కా ర్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు.

పకడ్బందీగా వాదనలు విన్పించాలి 

కృష్ణా పరీవాహక ప్రాంతానికి సంబంధించి ఇప్పటివరకు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు, ఏయే ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను ఇప్పటికే ట్రిబ్యునల్‌కు సమర్పించారు.. జలశక్తి మంత్రిత్వ శాఖకు ఇచ్చిన నివేదికలన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలని, వాటి ఆధారంగా ట్రిబ్యునల్ ఎదుట పకడ్బందీగా వాదనలు విన్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు విని యోగిస్తున్నందున.. వాటికి బదలుగా నాగార్జునసాగర్ ఎగువన 45 టీఎంసీ లు తెలంగాణకు కేటాయింపులున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. ఆ నీటి వాటాను ఎగువన ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకునే ప్రణాళికను అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.