9 April, 2026 | 5:03 AM

రిటమ్మైంట్స్ ఫుల్.. నియామకాలు నిల్

01-12-2024 01:06 AM
  1. జలమండలిలో ఏటా తగ్గుతున్న రెగ్యులర్ ఉద్యోగులు
  2. 2014 నుంచి జనరల్ పర్పస్ ఉద్యోగాలు భర్తీచేయని సర్కార్
  3. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులదే మెజార్టీ సంఖ్య
  4. ఉన్న ఉద్యోగులపై పనిభారం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీతో పాటు ఓఆర్‌ఆర్ వరకు ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలిలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 142 మంది రెగ్యులర్ ఉద్యోగులు రిటైర్ కాగా డిసెంబర్ 31 నాటికి మరో పదిమంది రెగ్యులర్ ఉద్యోగులు రిటైర్ కానున్నారు.

అయితే ఇందులో జలమండలిలో పనిచేస్తున్న డైరెక్టర్ స్థాయిలోని సీనియర్ అధికారులు ఎక్కువమంది పదవీ విరమణలు పొందుతున్నారు. వాస్తవానికి జలమండలిలో 2014 నుంచి ఇంతవరకు రెగ్యులర్ జనరల్ పర్పస్ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని, మూడేళ్ల క్రితం చేపట్టిన ఏఈఈ పోస్టుల నియామకమే చివరిదని తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల, సిబ్బంది కొరతతో వినియోగదారులకు సత్వర సేవలు అందడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఎక్కువమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే

జలమండలి పరిధిలోని వివిధ సెక్షన్లు, డివిజన్లు, సర్కిళ్లు, ప్రధాన కార్యాలయంలో కలిపి ప్రస్తుతం మొత్తం దాదాపు 7,800 ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో రెగ్యులర్ ఉద్యోగులు దాదాపు 3,300 మంది ఉండగా.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 4,500మంది ఉన్నారు. ట్రాన్స్‌మిషన్, క్వాలిటీ, వంటి కీలకమైన విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ మంది సేవలంది స్తుండటం గమనార్హం.

కాగా రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండటంతో ప్రస్తుతం ఉన్న రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై పనిభారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఔట్ సోర్సింగ్ ఉద్యోలకు జీహెచ్‌ఎంసీ మాదిరిగా జీవో 60 ప్రకారం జీతాలు అందడంలేదు. దీంతో దాదాపు తాము నెలకు రూ.6వేల వరకు వేతనం కోల్పోతున్నామని వారు ఆరోపిస్తున్నారు.

గతంలో గ్రేటర్ వరకు ఉన్న జలమండలి పరిధి కూడా ఓఆర్‌ఆర్ వరకు విస్తరించడంతో ఉన్న ఉద్యోగులతోనే సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది. జలమండలిలో రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేసి పని ఒత్తిడిని తగ్గించాలని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు కోరుతున్నారు. 

జీపీ ఉద్యోగుల నియామకాల్లేవ్

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీపీ ఉద్యోగుల భర్తీకి అవకాశం ఇచ్చినప్పటికీ.. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడలేదు. 2009, 2013, 2016, 2021లో మేనేజర్ పోస్టులను మాత్రం ప్రభుత్వం భర్తీ చేసింది. అయితే కింది స్థాయి ఉద్యోగుల పోస్టులను మాత్రం భర్తీ చేయలేదు. కాగా మరో 120 మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వా నికి జలమండలి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. రెండేళ్ల్ల క్రితం ప్రతిపాదనల మేరకు జలమండలికి కేటాయించాల్సిన జూనియర్ అసిస్టెంట్లను కూడా ప్రభుత్వం ఇంతవరకు కేటాయించలేదు.