22 May, 2026 | 8:53 AM

క్రిమినల్ చర్యలకూ వెనకాడవద్దు

19-06-2024 12:18 AM
  • గత ప్రభుత్వం తప్పిదాలను సమర్థించుకోవాలని చూస్తోంది
  • ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంతో రూ.2,600 కోట్ల నష్టం
  • కమిషన్‌కు తెలిపిన కోదండరాం, రఘు

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాం ఆరోపించారు. చట్టం ప్రకారమే అందరూ నడుచుకోవాలని, ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలని సూచించారు. విద్యుత్ అక్రమాలపై నియమించిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఉన్న బీఆర్‌కే భవన్‌కు విద్యుత్‌శాఖ మాజీ అధికారి రఘుతో కలిసి కోదండరాం వెళ్లారు. ఇద్దరి నుంచి కమిషన్ వివరాలు అడిగి తెలుసుకుంది.

అనంతరం కోదండరాం, రఘు మీడియా  ప్రతినిధులతో మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదని, గత ప్రభుత్వం తొందరపాటుగా వ్యహరించడంతో ట్రాన్స్‌కో, జెన్‌కోకు రూ.81 వేల కోట్ల అప్పులు అయ్యాయన్నారు. భవిష్యత్తులో గోదావరి వద్ద నీటిమట్టం పెరిగితే భద్రాద్రి ప్లాంట్‌ను కాపాడుకోగలమా? అని ప్రశ్నించిన ఆయన గత సంవత్సరం వచ్చిన వరదలకు భదాద్రి ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చిందన్నారు.

కనీస జాగ్రత్తలు పాటించకుండా భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. పోలవరం పూర్తయితే భద్రాద్రి ప్లాంట్ ముణిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ అంశాల్లో ప్రభుత్వానికి నష్టమని తెలిసినా దాన్నే ఉపయోగించారని కోదండరాం ఆరోపించారు. రెగ్యులేటరీ పరిధిలోకి వచ్చే అంశాలు లేవు కాబట్టి ప్రభుత్వం కమిషన్ వేసిందన్నారు. అప్పీలేట్ ట్రైబ్యునల్ పరిధిలో లేవు కాబట్టి కమిషన్ వేసేందుకు ఎటువంటి ఆటంకాలు రాలేదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల సాధారణ ప్రజానికానికి ఇబ్బందులు తలెత్తాయని, ఆ తప్పిదాలపై క్రిమినల్ చర్యలకు కూడా వెనుకాడవద్దని ఆయన కమిషన్‌కు సూచించారు.

ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో రూ.2600 కోట్లు నష్టం 

ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాల వల్ల రూ.2,600 నష్టం జరిగిందని విద్యుత్‌శాఖ మాజీ అధికారి రఘు తెలిపారు. భద్రాద్రి, యాదాద్రి, విద్యుత్ కేంద్రాలపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు ఇచ్చినట్లు రఘు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌తో మొదట 1,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఒప్పందం జరిగితే అది సప్లయి కాలేదని, తర్వాత తెలుసుకుని మరో 1,000 మెగావాట్లకు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. అనంతరం జరిగిన తప్పును తెలుసుకుని ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ప్రయత్నిస్తే కుదరలేదన్నారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందం రెగ్యులేటరీ కమిషన్ ఒప్పందం పొందలేదని ఆయన గుర్తుచేశారు.

ఇరు రాష్ట్రాల డిస్కంలు మాత్రమే ఎంవోయూ చేసుకున్నాయన్నారు. బీహెచ్‌ఈఎల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ 201314లో 88 ఉంటే తర్వాత జీరోకు పడిపోయిందన్నారు. మూడేళ్ళలో పూర్తి కావాల్సిన యాదాద్రి ప్లాంట్ 9 ఏళ్ల అయినా పూర్తి కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీహెచ్‌ఈఎల్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ రుద్దిందని చెప్పిన ఆయన భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం వాడిన యంత్రాలు సరైనవి కావన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ వల్ల రవాణా చార్జీల భారం పడుతుందని తెలిపారు. పర్యావరణ అంశాలను లెక్క చెయ్యకుండా భద్రాద్రి నిర్మాణం మొదలు పెట్టారన్నారు. కాంపిటేటివ్ బిడ్డింగ్‌లో రేటు తక్కువ అయ్యే అవకాశం ఉండేదని, కానీ అప్పటి ప్రభుత్వం ఆలా చేయలేదన్నారు. 2016లోనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళామన్నారు. అప్పుడే కమిషన్ పీపీఏ చేయమంటే 7 ఏళ్ళుగా చేయలేదన్నారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందం వల్ల మూడు రకాల నష్టాలు జరిగాయని వాటి ద్వారా రూ.635 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు.