22 May, 2026 | 9:47 AM

రేపు రాష్ట్రానికి కిషన్‌రెడ్డి

19-06-2024 12:05 AM

ఇప్పటికే హైదరాబాద్‌కు బండిసంజయ్ 

బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి కేంద్ర మంత్రుల కోసం భారీ ఊరేగింపు

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఈ నెల 20న జీ కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి రానున్నారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ మంగళవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం కరీం నగర్ నియోజకవర్గంలో పర్యటించి అనంతరం గురువారం కిషన్‌రెడ్డి, మంత్రులు వచ్చే సమయానికి బేగంపేట చేరుకుంటారు. అయితే ముందుగా ఇద్దరు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు బుధవారం రావాల్సి ఉండగా, అదేరోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం ఉండటంతో గరువారానికి వాయిదా పడింది.

కేంద్ర మంత్రులతో పాటు మొత్తం 8 మంది ఎంపీలకు ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ఊరేగింపుగా స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీకి ఏకంగా 8 ఎంపీ సీట్లు కట్టబెట్టడంతో అందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సెల్యూట్ తెలంగాణ పేరిట భారీ ర్యాలీని నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతున్నది.