21-01-2026 12:54:16 AM
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి):జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు మండిపడ్డారు. బీసీ ప్రధాని అని చెప్పుకునే నరేంద్ర మోదీ.. పేద ప్రజల ఆకలి తీర్చే ఉపాధి హామీ పథకం రద్దు చేయాలని చూడటం తగదన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించినందుకు నిరసనగా ఏఐసీసీ పీసీసీ ఆదేశాల మేరకు వీహెచ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాపూఘాట్‌లోని గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్షను నిర్వహించారు.
ఈ దీక్ష కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి తారీఖ్ అన్వర్ హాజరై వీహెచ్‌కు నిమ్మరసం ఇచ్చిన దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహా త్మగాంధీ పేరును తొలగించాలని చూడటం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకానికి పేరు మార్చాలనుకోవడం సరికాదన్నారు.
కేంద్ర మాజీ మంత్రి తారిఖ్ అన్వర్ మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం మత, కుల రాజకీయాలతో పాటు పేదల బతుకులను ఆగం చేయాలనే కుట్రలకు పాల్పడుతోందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షు లు అప్సర్ యూసఫ్ సాయి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్, పార్టీ నేతలు ఉస్మాన్ భాయ్, సైఫుల్ల, లింగ్విస్టిక్ మైనార్టీ సెల్ చైర్మన్ రాజేష్ అగర్వాల్, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.