కాంగ్రెస్‌తోనే దేశ హితం
బీజేపీ బహుళజాతి కంపెనీల కోసం పనిచేస్తోంది
పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రజల కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ మాత్రం బహుళజాతి కంపెనీల కోసం పని చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో ప్రస్తుతం మూడు అంశాలపైనే చర్చ జరుగుతోందని, దేశ వనరులు, సంపద ఈ దేశ ప్రజలకే చెందాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంటే.. ఆస్తులు, వ్యవస్థలను అమ్మి కొద్దిమందికి మోదీ ప్రభుత్వం కట్టబెడుతోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భట్టి పంజాబ్‌లోని వివిధ పార్లమెంట్ నియోజకవ ర్గాల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పంజాబ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత ప్రతాప్‌సింగ్ బజ్వాతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడుతూ రిజర్వేషన్లను జనాభా ప్రతిపాదికన పంపిణీ చేయాలని కాంగ్రెస్ చూస్తుంటే బీజేపీ మాత్రం రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. పాంచ్ న్యాయ్ పేరుతో కాంగ్రెస్ దేశ ప్రజల కోసం ముందు కు వచ్చిందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి కుటుంబ పెద్ద పేరుపై రూ.లక్ష నగదు జమ చేస్తామని, మహిళలను మహారాణులుగా చూస్తామని భట్టి వివరించారు.
తమిళనాడు తరహాలో దేశవ్యాప్తంగా 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఉచిత ఆరోగ్య బీమా అమలు చేస్తామన్నారు. దేశంలో హరిత విప్లవం తీసుకొచ్చి వ్యవసాయ ఉత్పత్తులను మూడింతలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని, రైతు, శ్రామికుల రుణమాఫీకి ఇండియా కూటమి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో రైతు రుణమాఫీ రూ.2 లక్షల త్వరలో చేయనున్నట్లు పంజాబ్ రైతులకు భట్టి వివరించారు.






