22 May, 2026 | 3:55 PM

డబుల్ బెడ్‌రూం పంచాయితీ!

22-08-2024 12:55 AM
  1. ఏడేండ్లయినా పంపిణీలో జాప్యం
  2. తాళాలు పగులగొట్టిన లబ్ధిదారులు
  3. అడ్డుకొని వెళ్లగొట్టిన పోలీసులు 

హనుమకొండ, ఆగస్టు 21 (విజయక్రాంతి): డబుల్ బెడ్ రూమ్ ఆశ చూపెట్టి గుడిసెవాసులకు గూడు లేకుండా చేశారు పాలకులు. తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కలలు మాత్రం కలలుగానే ఉంటాయేమోననే నిరాశ వారిలో కలుగుతున్నది. ప్రభు త్వం ఇచ్చిన స్థలంలో గుడిసెలు వేసుకున్న పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల ఆశచూసి ఖాళీ చేయించారు. ఇండ్లు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పంపిణీ చేయకుంగా గత ప్రభుత్వం కాలం వెళ్లదీసింది. కొత్త ప్రభుత్వమైనా ఇండ్లు మంజూరు చేస్తుందేమోనని ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కార్ కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇటీవల లబ్ధిదారులు ఇండ్ల తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసు లు అక్కడికి చేరుకుని వారిని ఖాళీ చేయించారు. దీంతో మరోసారి డబుల్ ఇండ్ల కోసం పేదలు పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

పంపిణీలో నిర్లక్ష్యం

సుమారు 40 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం హనుమకొండ బాలసముద్రంలోని ప్రభుత్వం స్థలంలో నిరుపేదలకు ఇండ్ల కోసం పట్టాలు పంపిణీ చేసింది. అప్పటి నుంచి  ఆ స్థలంలో గుడిసెలు వేసుకుని ఉంటూ ఆ ప్రాంతాలకు అంబేడ్కర్ నగర్, జితేందర్ నగర్‌లుగా పేరు పెట్టారు. అయితే రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో సీఎం కేసీఆర్ వరంగల్‌లో నాలుగు రోజు లు పర్యటించిచారు. నగరంలోని స్లమ్ ఏరియాల్లో తిరిగి గుడిసెవాసుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

ఇరుకు గదుల్లో ఉంటున్న వారందరికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు డబుల్ బెడ్‌రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. 2016 నుంచి 2018 వరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని బాలసముద్రంలో 592,  న్యూశాయంపేట లో 602 డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించారు. కానీ అర్హులైన వారికి పంచడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం బాబులు, వ్యభిచారులు, పేకాట రాయుళ్లు  వాటినిఅడ్డాలుగా చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 

అక్రమాలతోనే జాప్యం?

డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఏడేం డ్లు గడుస్తున్నా అర్హులకు పంపిణీ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రెండు సార్లు పంపిణీ చేస్తున్నట్లుగా ప్రకటించి వాయిదా వేశారు. అయితే డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపులో పలు అక్రమాలు జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. లబ్ధిదారుల నుంచి  హౌసిం గ్ ఏఈ డబ్బులు తీసుకున్నారని అరెస్ట్ చేయడంతో పాటు విధుల నుంచి తప్పించారు. అంతేగాక సుమారు 60 మంది వద్ద నుంచి ఓ మునిసిపాలిటీ అధికారి డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారంలో ఉంది.

వరంగల్ నగరానికి చెందిన ఓ మహిళా సంఘం లీడర్ కూడా ఇందులో ప్రముఖ  పాత్ర పోషించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యవహారాల కారణంగా డబుల్ బెడ్ రూం ఇండు పంపిణీ వాయిదా పడుతున్నట్లు పలువురు   పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అప్పటి స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ బస్తీ కమిటీలు వేశారు. దీనికితోడు అప్పటి కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి లబ్ధిదారులను గుర్తించి వేలం పద్ధతిలో ఇండ్లు కేటాయించాలని నిర్ణయించారు. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

పైగా బస్తీ కమిటీల్లో కూడా అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తా యి.  కమిటీ సభ్యులు ఆశావహుల నుంచి లక్షల రూపాయాలు దండుకున్నట్లు ప్రచా రం జరిగింది. ఈ విషయం కాస్తా ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో కమిటీ సభ్యులను మందలించినట్లు సమాచారం.

ఇండ్లు ఎప్పుడిస్తరు..

ఇటీవల గుడిసె వాసులు బాలసముద్రంలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల తాళా లు పగులగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. తాము ఇక్కడే ఉంటామని, తమకు ఇల్లు కేటాయించాలంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులతో గొడవకు దిగారు. గత ప్రభుత్వం ఇండ్లు ఇస్తామంటూ ఏడేళ్లు ఊరించిందని, కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా డబుల్ బెడ్ రూం ఇండ్ల ఊసే లేదని గుడిసె వాసులు విమర్శిస్తున్నారు. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గుడిసెల్లో ఉండలేక పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

సర్కార్ మారినా..

బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రె స్ సర్కారు రావడంతో పైసలు వసూ లు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బీఆర్‌ఎస్ హయాంలో ఆశావాహుల నుంచి డబ్బులు వసూ లు చేసిన బస్తీ కమిటీ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఇండ్ల కోసం డబ్బులు ఇచ్చిన వాళ్లు  కమిటీ సభ్యులను నిలదీయడం ప్రారంభించారు. వాళ్ల నుంచి తప్పించుకోవడానికి బస్తీ కమిటీ సభ్యు లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండ్ల ఆక్రమణకు గుడిసె వాసులను పావుగా వాడుకుంటున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాడు అంబేడ్కర్ నగర్, జితేందర్ సింగ్ నగర్‌లో 250 కుటుంబాలు ఉండేవి.

ఆ గుడిసె వాసులందరికీ ప్రొవిజనల్ పత్రాలు రాకపోవడమే నేడు బస్తీ కమిటీ సభ్యులకు వరంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యం లో ప్రస్తుత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అర్హులైన అందరికీ డబుల్ బెడ్‌రూం పంపిణీ చేస్తామని ప్రకటన చేశారు. తమ కారణంగానే ఇండ్లు మం జూరు అయ్యాయని చెప్పుకుంటున్న బస్తీ కమిటీ సభ్యులు వీలు చిక్కినప్పుడల్లా డబుల్ బెడ్ రూంల కోసం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు చేయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.