వృద్ధిపై సందేహాలు
దేశ జీడీపీ వృద్ధి రేటుకి సంబంధించిన అధికారిక గణాంకాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-- జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గణాంకాల గందరగోళానికి కారణమైంది. రిజర్వ్ బ్యాం క్ సహా ఆర్థిక సంస్థల అంచనాలను మించిన ఈ గణాంకాల విశ్వసనీయతపై పలువురు ఆర్థికవేత్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధిరేటు గణనలో వినియోగిస్తున్న ధరల మార్పిడి విధానం, గణాంకాల ఆధారాలు వంటి అంశాలపై ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ బహిరంగంగా అనుమానాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వాస్తవ వృద్ధిరేటును లెక్కించేటప్పుడు ధరల ప్రభావాన్ని తొలగించే విధానం ఫలితాలను ఎక్కువగా చూపే అవకాశం ఉందన్నది ఆర్థిక నిపుణుల వాదన.
మరోవైపు, గతేడాదితో పోలిస్తే ఉద్యోగాల కల్పన, ప్రైవే టు, విదేశీ పెట్టుబడులు వంటి కొన్ని కీలక సూచీలు వృద్ధిరేటుకు అనుగుణంగా లేవని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ఈ వాదన లను తీవ్రంగా ఖండించింది. ఇరువర్గాల వాదనలు ఎలా ఉన్నా, మన దేశ ఆర్థిక వ్యవస్థ గత కొంతకాలంగా సవాళ్లను ఎదుర్కొంటుండటం వాస్తవ మే. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, అనంతరం కరోనా కల్లోలం వంటి వరుస ఎదురుదెబ్బలు భారత ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయి.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా కొన్నేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్, ఇరాన్ అమెరికా యుద్ధాలు దేశ వ్యాపార, వాణిజ్యాలపై తీవ్రంగా ప్రభావం చూపాయి. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధం మూలంగా ఇంధన ధరల పెరుగుదల, అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు వంటివి వృద్ధికి ప్రతిబంధకంగా మారాయి. వ్యవసాయ సంక్షోభమూ వీటికి తోడైంది.
ప్రభుత్వం ప్రకటించిన వృద్ధిరేటు ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ, ప్రజల జీవితాల్లో దాని ప్రభావం ఎంత మేరకు కనిపిస్తున్నదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ క్రమం లో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం వంటి అంశాలను విస్మరించకూడదు. గణాంకాల్లో వినిపించే వృద్ధి కాకుం డా ప్రజల జీవితాల్లో కనిపించే పురోగతే ఆర్థిక వృద్ధికి నిజమైన కొలమానమని చెప్పక తప్పదు. వృద్ధి ఫలాలు సామాన్యుడి బతుకులో ప్రతిఫలిస్తే సహజంగానే గణాంకాల విశ్వసనీయత పెరుగుతుంది.






