20-08-2025 01:05:31 PM
అవార్డును అందజేసిన లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్త
కామారెడ్డి (విజయక్రాంతి): అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని అశోక హోటల్ లో నిర్వహించిన జాతీయ రక్తవీర్ పురస్కారాల కార్యక్రమంలో భాగంగా ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు వ్యక్తిగతంగా 77 సార్లు, తలసేమియా చిన్నారుల కోసం నాలుగు వేలకు పైగా రక్తాన్ని సేకరించి అందజేసినందుకు జాతీయ రక్తవీర్ పురస్కారాన్ని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్త(Ladakh Lieutenant Governor Kavinder Gupta), ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తలు అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, 18 సంవత్సరాల నుండి రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి అందజేయడం జరిగిందని, రానున్న రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను తలసేమియా చిన్నారుల కోసం నిర్వహిస్తామని, ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం మరింతగా కృషి చేస్తానని అన్నారు. ఈ అవార్డు రావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.