8 June, 2026 | 1:46 AM

నిమ్స్ డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ బాధ్యతల స్వీకరణ

08-06-2026 12:00 AM

పంజాగుట్ట, జూన్ 7 (విజయక్రాంతి): నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) 19వ డైరెక్టర్గా యూరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిమ్స్ పూర్వ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప నూతన డైరెక్టర్కు బాధ్యతలను అప్పగించి అభినందనలు తెలిపారు.

రాహుల్ దేవరాజ్ నాయకత్వంలో నిమ్స్ సంస్థ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని, వైద్య రంగంలో కొత్త విజయాలు సాధిస్తుందని బీరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నిమ్స్ అభివృద్ధి కోసం సంస్థ సిబ్బంది, అధ్యాపకులు, వైద్యులు అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ నిమ్స్ సంస్థను వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన రంగాల్లో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సమాజంలోని పేద, మధ్యతరగతి రోగులకు అత్యాధునిక, నాణ్యమైన, ఆర్థికంగా అందుబాటులో ఉండేలా వైద్య సేవలను అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతి వీర్, పరిపాలన విభాగం హెచ్.ఓ.డి డాక్టర్ లక్ష్మీ భాస్కర్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ కృష్ణ రెడ్డి, డాక్టర్ అమరేశ్వర్, డాక్టర్ రామ్మూర్తి, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.