calender_icon.png 23 February, 2026 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్మూర్ కల్లు డిపోలో హైడ్రామా!

16-11-2025 12:24:05 AM

  1. యాజమాన్యం బంధువుకు మూడవ డిపో అధ్యక్ష పీఠం   

ఫిర్యాదుల అస్త్రంతో డైరెక్టర్లకు చెక్ పెట్టిన ఉన్నతాధికారి!

కార్మికుల రూ.3 కోట్ల లావాదేవీల సంగతేంటి? 

రూ.50లక్షల బకాయిల కథేంటి? 

సొసైటీ సభ్యుల్లో ఆందోళన 

నిజామాబాద్, నవంబర్ 15 (విజయక్రాం తి): నిజామాబాద్ నగరంలోని మూడవ కల్లు డిపో సొసైటీ వ్యవహారం మరోసారి ముదిరింది. కార్మికులు, సభ్యులకు చెల్లించాల్సిన సుమారు రూ.3 కోట్ల వ్యాపార లావాదేవీల విషయం, రూ.50 లక్షల కార్మికుల బకాయిల వివాదం ఇంకా కొలిక్కి రాకముందే, సొసైటీ అధ్యక్షుడి ఎన్నిక తీవ్ర నాటకీయ పరిణామా ల మధ్య ముగిసింది.

స్వయంగా ఓ ఎక్సుజ్ ఉన్నతాధికారే రంగంలోకి దిగి, డైరెక్టర్లను బెదిరించినట్టుగా వ్యవహరించి, చివరికి యాజమాన్యం బంధువునే తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపిక చేసేలా చక్రం తిప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

అధికారి ఆధ్వర్యంలో ఎన్నికల డ్రామా

శనివారం ఎక్సుజ్ ఉన్నతాధికారి సమక్షంలో డిపో డైరెక్టర్ల సమావేశం జరిగింది. వాస్తవానికి సొసైటీపై వచ్చిన పలు ఫిర్యాదులపై విచారణకు ఈ సమా వేశం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. అయితే, సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే అసలు కథ మొదలైంది. సదరు ఉన్నతాధికారి, సొసైటీలోని 8 మంది డైరెక్టర్లలో 5 మందిపై వచ్చిన ఫిర్యాదులను ఒక్కొక్కటిగా చదివి వినిపించారు.

‘నేను అనుకుంటే మీరు డైరెక్టర్లుగా ఉండరు, కానీ వదిలిపెడుతున్నా. ఎందుకంటే మీ యజమానులతో నాకు మంచి సంబంధాలున్నాయి” అంటూ, వచ్చిన ఫిర్యాదులను పక్కన పెట్టేస్తున్నా’ అని అధికారి చెప్పడంతో డైరెక్టర్లంతా తెల్లమొహాలు వేశారు. ఒక్కో డైరెక్టర్‌కు ఉన్న మైనస్ పాయింట్లను ఎత్తి చూపు తూ, వారిని పూర్తిగా నిశ్శబ్దంలోకి నెట్టినట్టు సమాచారం. అనంతరం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, యాజమాన్యం కుటుంబానికి చెందిన బంధువు పేరును తాత్కాలిక అధ్యక్షుడిగా సదరు అధికారే ప్రతిపాదించిన ట్టుగా చెప్పించారు.

ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న డైరెక్టర్లు నోరు వెల్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదుల అస్త్రంతో నోరు మూయించడంతో, వారం తా మౌనంగా ఆమోదం తెలపాల్సి వచ్చింది. వెంటనే, అక్కడే ఉన్న కోపరేటివ్ ఇన్‌స్పెక్టర్‌ను పిలిచి, సమావేశ తీర్మానం రాయాలని అధికారి ఆదేశించడం, ఆ ఉద్యోగి చకచకా రాసివ్వడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.

బకాయిలు చెల్లించేదెప్పుడు? 

అసలు సమస్య అయిన కార్మికులు, సభ్యు ల రూ.50లక్షల బకాయిల చెల్లింపు అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. అధికారులు గతంలో చెప్పినట్టుగానే, యాజమాన్యం రూ.3 కోట్ల వ్యాపార లావాదేవీల లెక్కలు చెప్పి, రూ.50లక్షల బకాయిలు చెల్లించిన తర్వాతనే లైసెన్స్ రెన్యువల్ చేస్తారా? లేదా, బకాయిలు చెల్లించకముందే, ఈ కొత్త అధ్యక్షుడి ఆధ్వర్యంలో రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేస్తారా?

ఒక వేళ రూ.కోట్ల లెక్కలు, కార్మికుల రూ.50లక్షల బకాయిలు చెల్లించకముందే లైసెన్స్ రెన్యువల్ జరిగితే, ఎక్సుజ్ అధికారులు డిపో యాజమాన్యం ప్రలోభాలకు పూర్తిగా లొంగిపోయి నట్టేనని కార్మిక సంఘాలు, సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నాటకీయ పరిణామాలన్నీ చూస్తుంటే, బకాయిల చెల్లింపు వ్యవహారం పక్కదారి పట్టి, యాజమాన్యానికి లైన్ క్లియర్ చేసేందుకే ఇదంతా జరిగిందని తెలుస్తున్నది.

ప్రణాళిక ప్రకారమే ఇదంతా?

గత కొంతకాలంగా ఈ డిపో లైసెన్స్ రెన్యువల్ వ్యవహారం పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కార్మికులకు, సభ్యులకు చెల్లించాల్సిన రూ.50 లక్షల బకాయిలు, సుమారు రూ.3 కోట్ల లావాదేవీల లెక్కలు క్లియర్ చేసిన తర్వాతే రెన్యువల్ ప్రక్రియ చూస్తామని ఇదే ఎక్సుజ్ అధికారులు గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. ఈ బకాయిల చెల్లింపు వ్యవహారంపై గతంలో పలు కథనాలు కూడా వెలువడ్డాయి.

అయితే బకాయిలు చెల్లించాకే రెన్యువల్, రూ.3కోట్ల లెక్కలు చెప్పాకే రెన్యువల్ అని చెప్పిన అధికారులే..  ఇప్పుడు హఠాత్తుగా యాజమా న్యానికి అనుకూలంగా బంధువుకు అధ్యక్ష పదవి కట్టబెట్టడం వెనుక పెద్ద ప్రణాళికే ఉన్నట్టు స్పష్టమవుతోంది.

ఇది లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియలో యాజమాన్యానికి ఒక అడుగు క్లియర్ చేసినట్టుగా భావిస్తున్నారు. బకాయిల చెల్లింపు విషయాన్ని పక్కనపెట్టి, యాజమాన్యం బంధువుకు అధ్యక్ష పదవి దగ్గరుండి ఇప్పించడం పలు అనుమానాలకు తావిస్తోంది.