calender_icon.png 16 November, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీసరగుట్టలో దాగిన చరిత్ర

16-11-2025 12:13:38 AM

కీసరగుట్ట శివార్లలో ఏళ్లనాటి చరిత్ర దాగి ఉన్నది. కీసరలోని ప్రస్తుత రామలింగేశ్వరాలయం కాకతీయుల చేత పునరుద్ధరించబడింది. గుడికి దగ్గరలో బండలనడుమ నీటిగుంట వుంది. దాని పక్కన గుండ్రాతిమీద చతుర్భుజ నరసింహుని స్థానకమూర్తి అర్ధశిల్పం వుంది. 1975 నుంచి 1979,1981, 1983 వరకు జరిగిన పురావస్తుశాఖవారు త్రవ్వకాలు చేశారు. త్రికూటాలయాలు బయటపడ్డాయి. రాగినాణాలు, మట్టికలశాలు చాలా దొరికాయి. బయటపడిన రెండుగుడులలో రెండవదేవాలయం ఎత్తున ఉపానం, పైన జగతి, త్రిపట్ట కుముదం, కంపము,పట్టిక, ఉపరి కంపం, పట్టికలు చెక్కబడిన ఇటుకలతో నిర్మాణమై వుంది. 

కీసర గుట్ల శివార్లలో కోటగోడలు, శిథిలమైన ఇటుక కట్టడాలు ఎన్నో కనిపిస్తాయి. ఇటుకల కొలతలు 50.25.8, 46.23.7., 42.23.7., సెం.మీ.లు. రామలింగేశ్వరం ఆలయానికి పడమరన నల్లరాయి లింగాలు 4 వరుసల్లో, 3.5మీ.ల దూరంతో కనిపిస్తాయి. రుద్రభాగం గుండ్రంగా చేయబడివుంది. బ్రహ్మసూత్రం గీత కనిపిస్తుంది. విష్ణుభాగం అష్టముఖం నునుపు చేయబడింది. బ్రహ్మభాగం నలుపలకలుగా వుంది.

ఇటుక పీఠంలో బిగించబడివుంది. లింగపీఠం చతురస్రంగా వుంది. అంబుమార్గం లేదా సోమసూత్రం లేదు. రాతిప్రణాళికాపీఠం లేదు. ఆచ్ఛాదన లేదు. ఇటుకల కొలతలను బట్టి ఈ లింగాలన్నీ క్రీ.శ. 3,4 శతాబ్దిలో ప్రతిష్టించబడివుంటాయి. మధురలో ఇటువంటి లింగపీఠాలు కుషానుల కాలము(1,2 శ.) నాటివి వున్నాయి. గుడులు లేకుండా ఇటుక దిమ్మెలపై లింగాల ప్రతిష్ట మధుర శిల్పాలతో పోలివుంది.

ఇటుకపీఠాలు అర్ఘ్యపీఠాలే కాని, అభిషేకానికి పనికిరానివి. పూజ అర్చనార్ఘ్యాలతో చేయాలి. పుట్టతేనె, వెన్న వంటి పదార్థాలతో సుగాలీలు పూజలు చేస్తున్నారు. శబరిమలలో అయ్యప్పను తేనెతో అక్కడి ఆదివాసులు సేవిస్తుండేవారు. ఇది గిరిజన అర్చన. ఇవి మొక్కుబడి లింగాలై వుంటాయి. సర్వజనులకు అందుబాటులకు వుండడం కొరకు చేయబడినవై వుంటాయి. జైన, బౌద్ధాలలోని ‘దేవాయం దేయ్యం’ల వంటివి అనుకొనవచ్చు. 

కాకతీయులు పునరుద్ధరించిన రామలింగేశ్వరాలయం 

కీసరలోని ప్రస్తుత రామలింగేశ్వరాలయం కాకతీయుల చేత పునరుద్ధరించబడింది. గుడికి దగ్గరలో బండలనడుమ నీటిగుంట వుంది. దాని పక్కన గుండ్రాతిమీద చతుర్భుజ నరసింహుని స్థానకమూర్తి అర్ధశిల్పం వుంది. 1975 నుంచి 1979,1981, 1983 వరకు జరిగిన పురావస్తుశాఖవారు తవ్వకాలు జరిపారు. త్రికూటాలయాలు బయటపడ్డాయి. రాగినాణాలు, మట్టికలశాలు చాలా దొరికాయి. బయటపడిన రెండు గుడులలో రెండవ దేవాలయం ఎత్తున ఉపానం, పైన జగతి, త్రిపట్ట కుముదం, కంపము, పట్టిక, ఉపరి కంపం, పట్టికలు చెక్కబడిన ఇటుకలతో నిర్మాణమై వుంది.

ఇటుకగోడ ప్రాకారం వుంది. గుడి కింది పొరల్లో జుగుప్సాకరమైన అవశేషాలు దొరికాయని ఐకేశర్మ రాశాడు. దేవాలయం చుట్టూ పునాదిభాగాల పొరల్లో, పైన దొరికిన వస్తువులు దేవాలయ ప్రతిష్టా పద్ధతులను తెలిపేవి. గుడి ప్రాకారపు గోడకు దగ్గరగా ఒక కళేబరం దొరికింది. తలదాచుకుని, మోకాళ్ల మీద చేతులు పెట్టుకుని, నమస్కరిస్తున్నట్టున్న ఒక మనిషిని వాస్తు పురుషుని ఆవాహనం చేసేటపుడు నడివయసు మనిషిని బలి యిచ్చినట్టు తెలుస్తున్నది. వాస్తు మండలం నిర్ధారణ కాగానే వాస్తు పురుషునికి ఆహుతి, శాంతుల కొరకు ఈ పనిచేసినట్టున్నది. శతపథ బ్రాహ్మణంలో పురుషమేధము చేయడం, వాస్తుపూర్వ విధిగా చెప్పబడివుంది. 

బలికర్మ విధానంలో శాంతి సూచనలు

బలికర్మ విధానంలో దిశాదేవతలకు శాంతి సూచనలున్నాయి. మాయమతమనే వాస్తు గ్రంథంలో గృహక్షాత, పా పరాక్షసి అంతక వంటి దేవతలకు పశుమాంసం, మేక, జింక, పందిమాంసాలను ఆరగింపు చేయడం గురించి చెప్పబడ్డది.

కీసర తవ్వకాలలో పైగుడిలో ఒక మట్టికుండ లభించింది. కుండ నడుమ వున్న అంచు మీద మట్టిబొమ్మలు వున్నాయి. అవి ఆరు దేవతలవి. 5 కుండపొట్టమీద, 6వది మూతపైన స్త్రీమూర్తులున్నాయి. (మూతమీద కూర్చున్నది పురుషమూర్తి ‘వస్తోత్పత్తి’ అని ఆర్కియాలజీ వార్షికనివేదికలో) కుండపొట్టమీద పడగలెత్తిన 7సర్పాలు, వాసుకి, అర్గళ సర్పాలు, 5పంచభూతాలు కుడివైపున తిప్పిన తోకలతో ప్రదక్షిణం చేస్తున్నట్టున్నాయి. దీనినే ‘గర్భాపాత్ర’ అన్నారు. గర్భాలయంలో 9.9 సెం.మీ.ల రాతిఫలకం మీద దేవతారూపాలతో లభించింది.

4, 5 శకంలనాటి బ్రాహ్మణమత రీతికి సాక్ష్యమిది. పెద్దస్త్రీమూర్తి, శిరస్సు స్థానంలో వికసితపద్మం, కంఠాన ముత్యాలసరం, భుజకీర్తులు, పూర్ణకుచాలు, మేఖలతో బిగించిన నడుంతో అసామాన్యంగా కూర్చుని వున్న దేవత రెండుచేతులు కలిగివున్నది. రెండుచేతులతో శివ, విష్ణు సంకేత రూపాలనెత్తుకుని వుంది. కాళ్లనొక పక్కగా చాచి, పిరుదులపై కూర్చొని వుంది. కుడిచేతిన లింగపీఠం వుంది. ఫలకం కిందుగా కుడి అంచున నంది, దేవవీక్షణ తత్పరుడుగా వున్నాడు. ఎడమ చేతిలో సింహముఖముంది. కింద నరుడు మోకాళ్లపై వంగి నమస్కరిస్తున్నాడు. పైన సింహం, కింద నరుడు నరసింహవ్యూహంగా ఎరుగాలంటాడు ఐకే శర్మ. 

ఫలక మధ్య దేవత మాతృదేవత

విష్ణుధర్మోత్తరంలో ‘దేవ్యాశ్చ మస్తకే పద్మం తథాకార్యం మనోహరం, సౌభాగ్యం తత్ నిజానీహి’.. ఈమె మహాలక్ష్మి, సర్వమంగళ, మాతృదేవత. అమరుడు(క్రీ.శ.4వ శ.) ఇందిరా లోకమాతా మా, రమా మంగళదేవతా’ అన్నాడు. ఇటువంటి దేవతాఫలకం, వాస్తుప్రక్రియల వస్తువులు వేరెక్కడ దొరకలేదు. దైవరూపాలున్న మహాశక్తి త్రిమూర్తులలో బ్రహ్మస్థానంలో వుండి, శివ, విష్ణువులను ఎత్తుకొనివుంది.

గర్భవిన్యాస కార్యక్రమంలో గుండం మధ్య హోమాగ్నినుంచే ప్రదేశంలో ఈ శక్తిని ఆహ్వానించి పూజించివుంటారు. గురువు గర్భపాత్రను ఎత్తుకుని తూర్పునకు తిరిగి 100సార్లు శక్తిమంత్రాన్ని జపించి, అర్థరాత్రి హోమగుండంలో మంత్రయుక్తంగా గర్భస్తం చేయాలి. ఇది ఆలయనిర్మాణానికి ముందు చేసే ఆచారం.

కీసర నిర్మాణాలు

కీసర చెరువు ఉత్తరం గట్టున ఇటుకలతో కట్టిన 2 అడుగుల వెడల్పున్న 5 గదులు, బహుళ అంతస్తుల కొరకు కట్టిన పునాదులు, ప్రాసాదం మధ్యలో 3 గదు లు, పైకప్పులో పరిచే రాతిపలకలు. 2 మీ.ల వెడల్పున్న రాతిమెట్లు, రెయిలింగుతో వున్నాయి. అక్కడవున్న రా తి ఆధారపీఠాలు, వాటికి బ్రాకెట్లు అవి తోరణద్వారానికి ద్వారస్తంభాలు నిలుపడం కొరకు కావచ్చు. గుడి బయట కనిపించే కాలువ మీద ఇటుకల కప్పు అభిషేకజలాలు పోవడానికై వుంటుంది.

50*25*8 సెంమీ.ల కొలతలున్న గుండ్రాళ్లు, ఇటుకలతో కట్టిన కోడగోడల ఆనవాళ్లు. తూర్పు, పడమర, ఉత్తరదిశల్లో 3ద్వారాల ఆనవాళ్లు. లోపల మరో వరుస గోడలు. 3గదులు వ రండాతో, చంద్రశిలలు, పాతకాలపు రాతిముక్కలు పరిచిన నేల, సున్నం పూతగోడలు, దేవాలయం పడమ టివైపు.. గర్భగుడి (2.8...8.5మీ.) అంతరాళం 2.3...2.2 సున్నం పూత కట్టడాలున్నాయి. 

తవ్వకాల్లో మొదటిదశ: 3, 4 శ. లవి తొలి విష్ణుకుండినులు 14 నిర్మాణా లు, రెండోదశ: 4..6 శ.లవి 5 నిర్మాణాలు, పెద్దద్వారా ల వీధులకు కలిపినవి. గోడలు 8మీ. ఎత్తు, 1.9మీ. వెడ ల్పు, 2మీ. పునాది. ట్రావెలర్స్ బంగ్లా పక్క న స్నానఘట్టం, వెనక 5 గదుల నిర్మాణం, కోటగోడ పునాదు లు, ద్వారం తొలితరం శైవనిర్మాణాలుగా చెప్పవచ్చు.

పురావస్తు సముదాయం

కుండలు: నలుపు, బూడిద, ఎరుపు, ఎరుపు(స్లిప్పుడ్), నలుపు(స్లిప్పుడ్)రంగులలో గుండ్రనివి, సన్నమెడ పాత్రలు, పాత్రల స్టాండ్స్, ఆకులు, పూల డిజైన్లున్నవి లభించాయి. ఒంటితాడు డిజైన్, రెండుతాళ్లది, మూడు తాళ్లది, అలల గీతలు, కోణాలు, 4, 6, 8 దళాల పద్మాలు, గజమాల, కుమ్మరి చక్రంతో తిప్పి చేసినవి. 

పూసలు: అత్తికాయ, గోళము, ఉసిరికాయ, గొట్టం ఆకారాల్లో బంక మట్టివి, విలువైన రాళ్లతో చేసినవి.

టెర్రకోట: క్రీ.పూ.1వ శకం స్త్రీ రూపం, పూసలు, ముద్రలు, గణేశుడు 5.5 అం. రెండు చేతులు, గుడిన మూనా (అధిష్టాన, విమానాలతో).

నాణాలు: విష్ణుకుండినులవి (155) ఫోటీనుతో, రాగితో చేసిన నాణాలు. ఒక వైపు శిఖరం, దీపస్తంభాలు, కిరణవలయం, రెండోవైపు పంజాఎత్తిన సింహం.

రాళ్లు: నల్లరాతిలో స్త్రీ సూక్ష్మశిల్పం(13సెం.మీ.లు), లింగం(9న్నర.3 సెం.మీ.లు), క్రిస్టల్ శివలింగం(పురుషాంగ రూపం), పొత్రాలు, నూరుడురాళ్లు 

ఇనుము: చిట్టెం, కత్తులు, మొలలు, రివీట్లు, ఉలులు, కొడవల్లు, ఉంగరాలు

రాగి: నాణాలు, ఇత్తడి వూయెల

స్టక్కోలు: మానవ, జాంతవిక, పద్మ, నంది శిల్పాలు ముక్కలు (1,2 వ శ.లవి)

శాసన పట్టిక: తొలుచువాండ్రు (5వ శ.)

తొలుచువాండ్రు అంటే శిలలను తొలిచేవారు ఉండేచోట ఒక ఐదక్షరాల లేబుల్(నామక) శాసనం ఉంది. పురావస్తుశాఖ శాసనాల రిజిష్టరులో 5వ శతాబ్దంనాటి శాసనమని రికార్డు చేయబడివుంది. ఇదే తెలుగులో తొలి శాసనం.

ఇన్నీ దొరికిన చోట బౌద్ధ, జైన నిర్మాణాలు కూడా దొరకాలి. ఎందుకంటే విష్ణుకుండినులు బౌద్ధాన్ని పోషించిన జాడలు హైద్రాబాదులోని కొసగండ్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం (చైతన్యపురి) మీది శాసనాలు, ఆనవాళ్లు నిరూపిస్తున్నాయి.

అట్లే కీసర తవ్వకాలలో జైనతీర్థంకరుల అర్చామూర్తులు 13 దాకా అక్కడే దొరికాయి. మా పరిశీలనలో మూడుసింహాలున్న జైనతీర్థంకరుడు మహావీరుని అధిష్టానపీఠం, ఆలయం ఆనవాళ్ళు లభించాయి. ఇంకా పరిశోధించాల్సిన చారిత్రక ప్రదేశం కీసర.