అడ్వాన్స్‌గా నిధులు డ్రా
కేసముద్రం, మార్చి 11 (విజయక్రాంతి): గ్రామపంచాయతీకి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు కాగానే, గతంలో చేసిన పనులకు బిల్లుల చెల్లింపు తో పాటు ముందస్తుగా చేయని పనులకు కూడా అడ్వాన్స్ గా డబ్బులు డ్రా చేసిన ఘటన కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. ఇటీవల ప్రభుత్వం నుండి వివిధ పద్ధతుల ద్వారా 10 లక్షల రూపాయలకు పైగా నిధులు పంచాయతీ ఖాతాలో జమ అయ్యాయి.
ఈ క్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ కలిసి జాయింట్ చెక్ పవర్ ద్వారా పంచాయతీ ఖాతాలో జమ అయిన నిధులను పలు విడతలుగా డ్రా చేశారని, ఇందులో ఎలాంటి పనులు చేయకుండానే మూడు లక్షల రూపాయల వరకు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా, అడ్వాన్సుగా డ్రా చేసుకున్నారని ఆ గ్రామ వాట్సాప్ గ్రూపులో కొందరు డ్రా చేసినట్లు చెబుతున్న ఈ పంచాయతీ ద్వారా సేకరించిన రికార్డులను పోస్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది.
7 లక్షల వరకు గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించగా, మూడు లక్షల రూపాయల నిధులను అడ్వాన్సుగా డ్రా చేసి నొక్కేసారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ ఏర్పుల సునీత భర్త కుమార్ మాట్లాడుతూ పంచాయతీ ఖాతాలోకి 10 లక్షల పైగా నిధులు ఇటీవల విడుదల అయ్యాయని, అందులో కొన్ని పాత బకాయిలు చెల్లించామని, 3 లక్షల రూపాయలతో గ్రామంలో కొత్తగా మరుగుదొడ్లు,
స్నాన ఘట్టాలు నిర్మించాలని తలపెట్టామని, అయితే గ్రామస్తులు, వార్డు సభ్యులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ పనులు నిలిపివేసి, సిబ్బంది వేతన బకాయిలు చెల్లించామని, గ్రామపంచాయతీ నిధులు సొంతానికి వాడుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ముందస్తుగా, ఎలాంటి అనుమతి లేకుండా, తీర్మానం, నోట్ ఫైల్ లేకుండా సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలతో డబ్బులు డ్రా చేయడానికి నిబంధనలకు విరుద్ధమని కేసముద్రం ఎంపీడీవో క్రాంతి చెప్పారు.




