27 April, 2026 | 4:03 AM

చర్ల దప్పిక తీరేదెలా?

27-04-2026 02:17 AM

మండల ప్రజలకు తాగు నీటి వెతలు

పట్టించుకోని పంచాయతీ అధికారులు 

చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

చర్ల, ఏప్రిల్ 26, (విజయక్రాంతి): మండలంలో ఎండలు మండుతుండటంతో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతున్నది. రెండు మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రంలోని రఘు థియేటర్ ప్రధాన రహదారి మీదగా ఉండే ప్రజలు పగలు వచ్చే మిషన్ భగీరథ నీళ్లు సరిపోక బోరు పంపులను ఆశ్రయిస్తున్నారు. 

రాత్రివేళ బోరు పంపుల నుండి  నీటిని సరఫరా చేసుకుంటున్నారు. ఇదేమిటని విజయక్రాంతి రిపోర్టర్ ప్రశ్నించగా మా సమస్యలు, గ్రామపంచాయతీ సిబ్బందికి చెప్పినా కూడా పట్టించుకోవటం లేదని వాపోయారు. మేజర్ గ్రామపంచాయతీ అధికారులు పాలకవర్గం, తమ సమస్యలు పట్టించుకోవాలని వారు కోరుతున్నారు. పలు గ్రామాల్లో ఇప్పటినుంచే తాగునీటి సమస్య తలెత్తుతున్నదని, ఈ సమస్య మునుముందు మరింత జఠిలమవుతుందని ప్రజలు భయపడుతున్నారు.

మండలంలోని కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఇప్పటికే తలెత్తుతున్నది. మంచినీటి కోసం స్థానికంగా ప్రత్యామ్నాయం  లేకపోవడంతో ప్రజలంతా మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడ్డారు. మిషన్ భగీరథ నీటి విడుదలలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కారణంగా కూడా నీటి సమస్య ఉత్పన్నమవుతున్నది. నీటి సమస్య ఏర్పడినప్పుడు, ఇది మా పని కాదు పంచాయతీ సిబ్బంది పనే నని వారు, కాదు మిషన్ భగీరథ వాళ్లదేనని ఒకరి మీద ఒకరు వత్తాసు పలుకుతూ నిర్లక్ష్యం చేసిన సందర్భాలు ఎన్నో, మండలంలోని గ్రామీణ ప్రాంతాలన్నింటికీ, గ్రామపంచాయతీలో పర్యవేక్షణలో ఆయా ప్రాంతాలకు డిమాండ్కు అనుగుణంగా మిషన్ భగీరథ నీటిని విడుదల చేస్తున్నారు.

ఎండాకాలంలో నీటి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సమస్య తలెత్తుతున్నది. మరోవైపు, మరమ్మతుల కారణంగా కూడా నీటి సరఫరా రోజుల తరబడి నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తప్పడంలేదు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గ్రామీణ, పట్టణ, ప్రాంత ప్రజలు అధికారులను కోరుతున్నారు.