09-11-2025 12:20:08 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఓ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. బేగంపేటలోని క్యూలినరీ అకాడమీ ఆఫ్ ఇండియాకు చెందిన ఆరుగురు విద్యార్థులను గంజా యి సేవిస్తున్నారన్న ఆరోపణలపై తెలంగాణ ఈగిల్ ఫోర్స్‌కు చెందిన హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన రోజు పార్టీలో విద్యార్థులు డ్రగ్ సేవించినట్టు సమాచారం.
ఈగిల్ ఫోర్స్ విచార ణలో భాగంగా 11 మంది విద్యార్థులు తాము గంజాయి తీసుకునే అలవాటు ఉం దని అంగీకరించారు. దీంతో వారి తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ సుధాకర్ రావు సమక్షంలో వారికి యూరిన్ డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షలలో 11 మందిలో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో సాక్షి ఇమాలియా (22), మోహిత్ షాహి (21), శుభం రావత్ (27), కరోలినా సింథియా హారిసన్ (19), అరిక్ జోనాథన్ ఆంథోనీ (21), లాయ్ బారువా (22) ఉన్నారు.
వీరంతా క్యూలినరీ అకాడమీ ఆఫ్ ఇండియాలో బ్యాచిలర్ ఇన్ క్యాటరింగ్ టెక్నా లజీ అండ్ క్యూలినరీ ఆర్ట్స్ చివరి సంవత్సరం చదువుతున్నారు. తమ కాలేజీ విద్యార్థి పుట్టినరోజు పార్టీ సందర్భంగా గంజాయి సేవించినట్లు అంగీకరించారు. వీరిపై హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఆరుగురిని డీ-అడిక్షన్ కేంద్రానికి పంపారు.
విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నది ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన జాసన్ అనే వ్యక్తిగా గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నారు. కాగా ఈ కళాశాలలో డ్రగ్స్ కేసులు బయటపడటం ఇది మొదటిసారి కాదని ఈగిల్ ఫోర్స్ తీవ్రఆగ్రహం వ్యక్తంచేసింది. గతం లో కూడా కొందరి విద్యార్థులను డ్రగ్స్ కేసులో పట్టుకుని, యాజమాన్యం సమక్షంలో వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. అయినప్పటికీ, కౌన్సెలింగ్ వల్ల ఎలాంటి సానుకూల ప్రభావం కనిపించకపోవడంతో అధికారులు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.