బహదూర్‌పూర్‌లో డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: పాతబస్తీ బహదూర్‌పురలోని హసన్‌నగర్ ఎక్స్ రోడ్స్ సమీపంలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న మహిళతో సహా ఐదుగురిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఎన్‌ఏబీ) అధికారులు బహదూర్‌పురా పోలీసులతో కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన 34 గ్రాముల ఎండీఎంఏ, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో సయ్యద్ ఫైసల్ (27), మస్రత్ ఉన్నిసా బేగం అలియాస్ నదియా (27), జునైద్ ఖాన్ (29), మహ్మద్ అబ్రరుద్దీన్ (28), రహమత్ ఖాన్ (46) ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫైసల్, అబ్రార్, రహ్మత్, జునైద్ స్నేహితులు కాగా, మస్రత్ ఫైసల్ భార్య. ముఠాగా ఏర్పడి మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు.
నిందితులు నాలుగేళ్లుగా డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారు. రేవ్ పార్టీలతో పాటు పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో పాటు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. సయ్యద్ 3 నెలల్లో 19 మంది ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాడు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడానికి సయ్యద్ తన భార్యను డ్రగ్స్ ట్రాన్స్‌పోర్టర్‌గా ఉపయోగిస్తున్నాడు. తద్వారా పోలీసులు మహిళలను రవాణాదారులుగా అనుమానించలేరు. వారం రోజుల క్రితం, ఫైసల్, మస్రత్, అబ్రార్, రహమత్ బెంగళూరు వెళ్లి అక్కడ జునైద్‌ను కలుసుకుని తమకు తెలిసిన వారి నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.






